
తెలంగాణలో నిన్నామొన్నటి వరకు ఉన్న రాజకీయాల మాదిరిగా రేపటి పాలిటిక్స్ ఉండబోవనే సంకేతాలైతే మెండుగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి భవిష్యత్ అంత ఈజీ కాదనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు. ఇటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ టార్గెట్ గా ఏ స్థాయిలో విమర్శలు చేస్తుంటారో తెలిసిందే. ఇప్పుడు రేవంత్ కూడా తోడయ్యాడు. ఫైర్ బ్రాండ్ అన్న ఒకే ఒక్క కారణంతో.. మిగిలిన విషయాలన్నీ పక్కనబెట్టి పట్టం కట్టింది కాంగ్రెస్ అధిష్టానం. దాన్ని నిలబెట్టుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదలుకోడు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక, మూడోవైపు నుంచి తాను కూడా ఉన్నానంటూ మధ్య మధ్యలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు షర్మిల. ఈ ముప్పేట దాడిని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారన్నదే కీలకం.
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీజేపీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటూ వచ్చారు కమలనాథులు. కానీ.. ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగర్ ఉప ఎన్నికతో డీలా పడిపోయారు. ఇప్పుడు ఈటల చేరికతో.. పుంజుకోవాలని, హుజూరాబాద్ గెలుపుతో మరోసారి ధీటుగా నిలబడాలని ప్రయత్నిస్తున్నారు. ఈటల గెలవడం ద్వారా.. వచ్చే ఎన్నికల నాటికి హోరాహోరీ పోరు కొనసాగించాలని, కుదిరితే అధికారం కూడా సాధించాలనే పట్టుదలతో ఉన్నారు కాషాయ నేతలు.
ఇటు, కాంగ్రెస్ లో ఓ కొత్త వాతావరణమైతే కనిపిస్తోంది. ఇన్నాళ్లూ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉందా? లేదా? అన్నట్టుగానే కాలం గడిచిపోయింది. ఇలాంటి పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో.. సీనియర్లు ఎంత మంది మోకాళ్లు, మోచేతులు అడ్డుపెట్టినా.. అన్నిటినీ పక్కకు నెట్టి, రేవంత్ కు పీసీసీ కట్టబెట్టింది. అధిష్టానం. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా సగం కాలం ఉంది. రేవంత్ తనను తాను నిరూపించుకోవడానికి, పార్టీకి పూర్వవైభవం అందించడానికి ఈ సమయం సరిపోతుంది. ఆయన సత్తా ఏంటో వచ్చే ఎన్నికలతో తేలిపోతుంది కూడా. అందువల్ల.. తనని నిరూపించుకోవడానికి రేవంత్ శాయశక్తులా కృషి చేస్తాడనడంలో డౌట్ లేదు.
ఇక, షర్మిల కూడా తాను తెలంగాణలో రాజకీయం నెరపుతానంటూ వచ్చిన సంగతి తెలిసిందే. కార్యక్రమాలు ఏవీ లేకున్నా.. తాను లైన్లోనే ఉన్నానని చెప్పడానికి మధ్య మధ్యలో ఒక ట్వీటో, ఒక ప్రకటన ప్రభుత్వంపై వేస్తున్నారు. ఎన్నికల నాటికి ఆమె కూడా యాక్టివ్ అవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో.. కేసీఆర్ కు రాబోయే కాలం అంత ఈజీకాదనే విషయం స్పష్టమవుతోంది. మరి, దీన్ని ఎలా ఫేస్ చేస్తారు అన్నది ఆసక్తికరం. హుజూరాబాద్ ఉప ఎన్నిక.. రాష్ట్ర రాజకీయాలపై ఓ క్లారిటీ ఇస్తుందని అంటున్నారు. అందువల్ల విపక్షాలు, అధికార పక్షం హోరాహోరీ పోరు సాగిస్తారు. మరి, ఫలితం ఎలా వస్తుంది? భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయన్నది చూడాలి.