KCR: ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. అప్పుడే సమాజంలో గౌరవం, అనుకున్నది సాధించగలుగుతాము. ఈ విషయం తెలిసిన వారే సక్సెస్ అవుతారు. ఏ రంగంలో ఉన్న విజయం పొందగలుగుతారు. అయితే తాజాగా కెసిఆర్ విషయంలో ఇదే తరహా చర్చ నడుస్తోంది. ఆయన జాతీయ రాజకీయ ప్రకటనల విషయంలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితిని ఏ విధంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.
తనకు సెంటిమెంట్ గా కలిసి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితిని.. భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలని కేసీఆర్ భావించారు. తెలంగాణలో 16 సీట్లు… మహారాష్ట్రలో పాతిక సీట్లు సాధిస్తే 40 సీట్లు వస్తాయని.. ఏకంగా ఢిల్లీలో చక్రం తిప్పవచ్చని భావించారు. దేశం మొత్తం తిరిగి హడావిడి చేశారు. కానీ ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయారు. ఇంట గెలవలేకపోయారు. మరి రచ్చ ఎలా గెలుస్తారో అన్నది ఆయనకే ఎరుక. కెసిఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చి ఉంటే అదో చరిత్రే. జాతీయస్థాయిలో కేసీఆర్ పేరు మార్మోగిపోయేది. జాతీయ రాజకీయాలు ఆయనను సాదరంగా ఆహ్వానించేవి. దేశవ్యాప్తంగా ఒక క్రేజ్ తెచ్చి పెట్టేవి. భారత రాష్ట్ర సమితిలో చేరికలు కూడా పెరిగేవి. ఉత్తరాది రాష్ట్రాల్లో బీఆర్ఎస్ విస్తరించి ఉండేది. కానీ ఈ చర్యలను తెలంగాణలో ఓటమి బ్రేక్ చేసింది.
ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి బీఆర్ఎస్ ప్రవేశం కంటే.. ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడమే కేసిఆర్ ముందున్న కర్తవ్యం. సభా నాయకుడిగా రేవంత్ రెడ్డి ఉంటే.. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వ్యవహరించి అవకాశాలు చాలా తక్కువ. ఈ సమయంలో కెసిఆర్ జాతీయ రాజకీయాలు చేయాలంటే సాహసంతో కూడుకున్న పని. ఇప్పుడున్న కూటమిలు జాతీయ పార్టీల నేతృత్వంలోనే నడుస్తున్నాయి. ఈ లెక్కన కాంగ్రెస్, బిజెపి కింద పని చేయాల్సి ఉంటుంది. అలాగని కెసిఆర్ ప్రత్యేక కూటమి తయారు చేసే అవకాశమే లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా ఒక ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి.. పార్లమెంటులో అడుగుపెట్టడమే కేసీఆర్ ముందున్న ఏకైక మార్గం. రాష్ట్రంలో కుమారుడు కేటీఆర్ కు ప్రతిపక్ష నేత పదవి ఇచ్చి.. తాను కేంద్రం బాట పట్టడమే ఏకైక మార్గం. అంతకుమించి జాతీయ రాజకీయాలు చేయడం అంటే ఆత్మహత్య సదృశ్యమే. ఇక తేల్చుకోవాల్సింది కేసీఆరే.