KCR : పార్లమెంటు ఎన్నికలకు త్వరలో ప్రకటన రానుంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఒక దఫా అభ్యర్థులను ప్రకటించింది.. కాంగ్రెస్ ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేసిన నేపథ్యంలో పొత్తులు కుదిరిన తర్వాతే సీట్లు కేటాయించే అవకాశం ఉంది.. ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికొస్తే భారత రాష్ట్ర సమితి ఇప్పటివరకు పెద్దపల్లి, కరీంనగర్ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం కరీంనగర్ వేదికగా పూరించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆదివారం తెలంగాణ భవన్ లో కీలక నేతలతో సమావేశమయ్యారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాలకు చెందిన నాయకులతో సమీక్ష నిర్వహించారు.
” ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో హస్తం హవా ఉండదు. కాంగ్రెస్ పార్టీ చరిష్మా చతికిల పడిపోయింది.. ఎన్నికల్లో పోటీ కేవలం భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ మధ్య ఉంటుంది. ఇప్పటికే కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాం. త్వరలో మిగతా స్థానాలకు కూడా ప్రకటిస్తామని” కెసిఆర్ అన్నట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు మార్చి 12న కరీంనగర్లో పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని కెసిఆర్ పూరిస్తారని తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితికి పురిగడ్డ లాంటి కరీంనగర్ ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా అక్కడ ఓటర్లను ఆకట్టుకోవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
పార్లమెంటు ఎన్నికల్లో కేవలం బిజెపి, బిఆర్ ఎస్ మధ్య మాత్రమే పోటీ ఉంటుందని కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. కాంగ్రెస్ నాయకులు స్పందిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారని.. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. అసలు పోటీ చేయడానికి అభ్యర్థులే లేని భారత రాష్ట్ర సమితి.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా సత్తా చాటుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు బిజెపి, బీఆర్ఎస్ రహస్య బంధాన్ని వ్యక్తం చేస్తున్నాయని వారు అంటున్నారు.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి సత్తా చాటుతుందని వారు వివరిస్తున్నారు. కాగా, కెసిఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇంతవరకు బిజెపి నాయకులు స్పందించకపోవడం విశేషం.