KCR- Jagan: మిత్రుడు కేసీఆర్ కు జగన్ కరెంట్ షాక్ ఇచ్చారు. ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల విషయంలో భారీ ఉపశమనం పొందారు. సరైన సమయంలో కేంద్రం సాయంతో విద్యుత్ బిల్లుల పంచాయితీకి చెక్ చెప్పడానికి ప్రయత్నించారు. తన చేతికి మట్టి అంటకుండా.. నేరుగా తెలంగాణ ప్రభుత్వం ఖాతా నుంచి విద్యుత్ బిల్లులు కట్ చేసేలా కేంద్రాన్ని ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు.
ఏపీకి తెలంగాణ ప్రభుత్వం దాదాపు 6000 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీనిపై వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. ఈ బకాయిలు చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్న తీరుపై ప్రశ్నించారు. దీనిపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కేసింగ్ మౌఖికంగా సమాధానం ఇచ్చారు. విద్యుత్ బకాయిలను తెలంగాణ నుంచి నేరుగా కట్ చేసేలా కేంద్ర న్యాయ, ఆర్థిక శాఖలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. గతంలో కేంద్రం ఆదేశాల మేరకే ఏపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యుత్ ను పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ బకాయిలు చెల్లించుకుంటే కఠిన చర్యలు తీసుకోవచ్చని విభజన చట్టంలోనే పేర్కొన్నట్లు చెప్పుకొచ్చారు. అందుకే ఈ బకాయిల మొత్తాన్ని కోత పెట్టేలా రిజర్వ్ బ్యాంకుకు ఆదేశాలు జారీ చేసే విషయమై పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు.
అయితే ఏపీ,తెలంగాణ ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. రాజకీయ పరస్పర సహకారం అందుతోంది. కానీ విభజన హామీల అమలు, సమస్యల పరిష్కారం విషయంలో మాత్రం ఎడతెగని జాప్యం జరుగుతోంది. ఈ విద్యుత్ బకాయిల విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడితే పరిష్కారం అయ్యేది. కానీ పంచాయితీని కేంద్రంపై నెట్టారు. ఇప్పుడు బిజెపి చుట్టూ వివాదం అలుముకుంటుంది. ఏపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తే తెలంగాణలో.. తెలంగాణ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తే ఏపీలో.. బిజెపికి నష్టం తప్పదు. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బిజెపి.. ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్తు బకాయిలనుచెల్లించేందుకు..తెలంగాణకు కోత విధిస్తే అది అధికారం బి ఆర్ ఎస్ కు రాజకీయంగా లబ్ధి చేకూర్చునుంది. తెలంగాణలో బిజెపికి ప్రతికూలత ఎదురుకానుంది. సో జగన్ అదును చూసి మిత్రుడు కేసిఆర్ కు కరెంట్ షాక్ తో పాటు.. రాజకీయ లబ్ధి చేకూరుస్తున్నారన్నమాట.