
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. కరోనా వైరస్ ఉధృతి, లాక్ డౌన్ వల్ల సీఎం కేసీఆర్ గతంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించారు. వేతనాల్లో కోత వల్ల ఉద్యోగులు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. చాలామంది ఉద్యోగులు కోత విధించిన మొత్తాన్ని తెలంగాణ సర్కార్ తిరిగి చెల్లించదని భావించారు. అయితే సీఎం కేసీఆర్ వేతనాల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ సర్కార్ నాలుగు విడతల్లో కోత విధించిన మొత్తాన్ని తిరిగి చెల్లించనుంది. ఉద్యోగులందరికీ ఈ నెల నుంచి జనవరి వరకు కోత విధించిన మొత్తం జమ కానుంది. పెన్షనర్ల విషయంలో మాత్రం తెలంగాణ సర్కార్ మరో విధంగా ముందుకెళుతోంది. ఈ నెల, వచ్చే నెలలో పెన్షనర్లకు రెండు విడతల్లో చెల్లించడానికి సిద్ధమవుతోంది. కోత విధించిన మొత్తాన్ని చెల్లిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ఆర్థిక శాఖ నుంచి ఇప్పటికే ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. కరోనా విపత్కర పరిస్థితుల వల్ల తెలంగాణ సర్కార్ మార్చి నెల నుంచి మే నెల వరకు వేతనాల్లో కోత విధించింది. జూన్ నెల నుంచి పూర్తిస్థాయిలో ఉద్యోగుల ఖాతాలలో నగదు జమైంది. కోత విధించిన వేతనాల గురించి ఆ సమయంలో ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు.
అయితే జూన్ నెల 1వ తేదీ నుంచి అన్ లాక్ సడలింపులు అమలులోకి రావడంతో గతంతో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగైంది. దీంతో ఉద్యోగుల వేతనాలకు సంబంధించి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. చాలా కాలం నుంచి ఉద్యోగులు కోత విధించిన వేతనాల కోసం ఎదురు చూస్తుండగా ఎట్టకేలకు వాళ్ల ఆశలు ఫలించాయి. అన్ లాక్ సడలింపుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా క్రమంగా మెరుగవుతూ ఉండటం గమనార్హం.