Telangana Education: ఏపీలో ఇప్పటికే ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి ఇక్కడి ప్రజలు, విద్యార్థుల ఆదరాభిమానాలను ఏపీసీఎం జగన్ చూరగొన్నారు. లేట్ గా అయినా లేటెస్ట్ గా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు విప్లవాత్మక అడుగులు వేశారు. ఏకంగా విద్యావ్యవస్థ ప్రక్షాళనకు నడుం బిగించారు.
-తెలుగు రాష్ట్రాల్లో ‘విద్య’ ఒక మాఫియా
తెలుగు రాష్ట్రాల్లో విద్యావ్యవస్థ అనేది ఒక మాఫియాగా తయారైందనడంలో ఎలాంటి సందేహం లేదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ర్యాంకుల వెంట పరిగెడుతూ విద్యార్థులను పరిగెత్తిస్తూ లక్షల ఫీజులు వసూలు చేసి దీన్ని ఒక పెద్ద దందాలా కార్పొరేట్ విద్యాసంస్థలు మార్చేశాయి. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేసి ప్రైవేటు విద్యావ్యవస్థ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బలంగా పాదుకుంది.ఇలాంటి వాటికి ఏపీ సీఎం జగన్ చెక్ పెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియా పెట్టారు..
-జగన్ ను టార్గెట్ చేసి రచ్చ
జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెడితే ఆయన అనుసరిస్తున్న మతం ‘క్రిస్టియానిటీని’ జగన్ ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఇక పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ఉపరాష్ట్రపతి వెంకయ్య లాంటి వారు తెలుగు మీడియంను జగన్ సర్కార్ ఖూనీ చేస్తోందని విమర్శించారు. కానీ వాళ్ల మనవలు చదివే ఇంగ్లీష్ మీడియం చదువులు.. ఏపీ పేద పిల్లలు చదవాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జగన్ చెబుతూ వెనకడుగు వేయలేదు.
-జగన్ బాటలో కేసీఆర్.. విద్యావ్యవస్థ ప్రక్షాళనకు అడుగులు
ఇక జగన్ బాటలో కేసీఆర్ నడిచాడు. విద్యావ్యవస్థ ప్రక్షాళనకు అడుగులు వేశాడు. తాజాగా ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని కేసీఆర్ కేబినెట్ నిర్ణయించింది.అంతే కాదు మరో సంచలన స్టెప్ తీసుకున్నారు.
-ప్రైవేటు విద్యా దోపిడీ వ్యవస్థకు చెక్
ఇక ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో పెట్టడంతోపాటు పేదల రక్తం తాగేలా స్కూల్ ఫీజులు పెంచి పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఫీజుల నియంత్రణపై కొత్త చట్టం తీసుకురావాలని కేసీఆర్ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్ మీడియం, ఫీజుల నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఇక ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల దోపిడీకి తెలంగాణలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-‘మన ఊరు-మన బడి’తో పాఠశాలలకు మెరుగులు
ఇక ఏపీలో లాగానే తెలంగాణలోనూ పాఠశాలల రూపు మార్చాలని కేసీఆర్ సర్కార్ డిసైడ్ అయ్యింది. ఏకంగా ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం కింద రూ.7289 కోట్లు కేటాయించడం విశేషం. ఇప్పటికే విద్యార్థులు లేక.. రాక ప్రైవేటు బాటపట్టిన పరిస్థితుల్లో కేసీఆర్ చేస్తున్న ఈ ప్రక్షాళన చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టా? లేక ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటులో ఫీజుల నియంత్రణ మాత్రం కాస్తా పేదలకు ఉపశమనం అంటున్నారు.
-ఎట్టకేలకు విద్యావ్యవస్థను పట్టించుకున్న కేసీఆర్
తెలంగాణ ఏర్పడ్డాక నీళ్లు, నిధుల సమస్య తీర్చిన కేసీఆర్ నియామకాలు.. విద్యావ్యవస్థను మాత్రం పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. దాంతో యువత, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు, నిరుద్యోగుల్లో కేసీఆర్ సర్కార్ వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ప్రైవేటు స్కూళ్ల ఫీజులతో కరోనా వేళ సామాన్యుల నడ్డి విరుగుతోంది. ఎట్టకేలకు కేసీఆర్ సర్కార్ మేల్కొని ఈ విద్యావ్యవస్థ ప్రక్షాళనకు అడుగులు వేయడం శుభ సూచికమనే చెప్పాలి. మరి ఆ ఫలాలు పేదలకు అందుతాయా? లేదా? అన్నది వేచిచూడాలి.