CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలను ఆకట్టుకోవడంలో దిట్ట. ఓట్ల కోసం సాధ్యం కాని హామీలను కూడా ఇచ్చి ప్రజలను మెప్పించగలుగుతారు. గెలిచిన తర్వాత అది సాధ్యం కాదని కూడా ప్రజలు నమ్మేలా చేయగే మాటల మాంత్రికుడు. అయితే తాజాగా ఆయన తన ఎమ్మెల్యేలకు ఇచ్చిన మాటనే మార్చారు. ఎన్నికలకు మరో ఆరు నెలల సమయమే ఉన్న నేపథ్యంలో ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలను పునరాలోచనలో పడేసింది.
గతంలో సిటిటంగ్‌లకే టికెట్ అని..
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గత ఏడాదిగా వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకే టికెట్ ఇస్తామని ప్రకటిస్తున్నారు. ముందస్తు పార్టీ శాసన సభ పక్షం సమావేశం నిర్వహించిన ప్రతీసారి కేసీఆర్ ఇదే హామీ ఇస్తూ వచ్చారు. దీంతో అప్పటల్లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు కూడా వెళ్తారని ప్రచారం జరిగింది. దీనిని కేసీఆర్ కొట్టి పారేయలేదు. చాలా రోజుల తర్వాత ముందస్తు ఎన్నికల ముచ్చటే లేదని ప్రకటించారు. ఇక, సిట్టింగులకే టికెట్ అన్న హామీతో ఎమ్మెల్యేలు గుండెమీద చెయ్యి వేసుకుని నిద్రపోతున్నారు.
పనిచేసేవారికే అని తాజాగా ప్రకటన..
తాజాగా సీఎం కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల విషయంపై మాట మార్చారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ప్రతినిధుల సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెఈ్ప చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు హాజరయ్యారు.
రాబోయే ఎన్నికలపైనే ప్రధాన చర్చ..
సభ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. కేసీఆర్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం సమావేశ మందిరంలో ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం చేయాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ అంతర్గత సర్వేలు వచ్చే ఎన్నికల్లోనూ ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయనే సూచిస్తున్నాయని తెలిపారు. అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్లు మాత్రం పనిచేసే వారికే ఇస్తామని ప్రకటించినట్లు సమాచారం. నియోజకవర్గాల్లో గట్టిగా పనిచేయాలని, బాగా పనిచేసే వారికి, వారి పనితీరు ఆధారంగానే టికెట్ ఇస్తామని చెప్పినట్లు తెలసింది. దీంతో ఇన్నాళ్లూ సిట్టింగులకే సీటు అని కేసీఆర్ ఇచ్చిన హామీతో ధీమాగా ఉన్న ఎమ్మెల్యేలంతా తాజా ప్రకటనతో కంగుతిన్నారు.
ఆశావహుల్లో ఉత్సాహం..
కేసీఆర్ తాజా ప్రకటనతో సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఆందోళన నెలకొనగా, రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్న నేతల్లో ఉత్సాహం నెలకొంది. పనితీరు ఆధారంగా టికెట్ ఇస్తే తమకే టికెట్ వస్తుందని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. కేసీఆర్ ఎన్నికల వేళ మంచి నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే, టికెట్ విషయంలో కేసీఆర్ మాట మార్చడంతో టికెట్ రాదని భావిస్తున్న నేతలు ప్రత్యామ్నాయం చూసుకోవడమే బెటర్ అని అనుకుంటున్నారట.