తెలంగాణలో సీఎం కేసీఆర్ మాటకు ఎదురులేదని చెప్పొచ్చు. ప్రతిపక్షాల్లోనూ సీఎంను గట్టిగా నిలదీసే నాయకులు మచ్చుకైనా కన్పించరు. దీంతో తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆడిందే ఆట. పాడిందే పాటగా పాలన కొనసాగుతూ వస్తోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ బలహీనం చేయడంలో సీఎం కేసీఆర్ ఏనాడో విజయం సాధించారు. అయితే కొంతకాలంగా టీఆర్ఎస్ సర్కార్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనూహ్యంగా బీజేపీ తెలంగాణలో బలపడుతుండటంతో సీఎం కేసీఆర్ ఆ పార్టీపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీపై కాంగ్రెస్ అస్త్రాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో అంతగా బలంలేని బీజేపీ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా నాలుగు స్థానాలు గెలిచి సత్తాచాటింది. తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మించి బీజేపీ సీట్లు సాధించి తెలంగాణలో బలపడింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో తెలంగాణలో మరింత బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అధికారంలోని టీఆర్ఎస్ పార్టీపై దూకుడుగా వెళుతుంది. సీఎం కేసీఆర్, మంత్రులను టార్గెట్ చేస్తూ ప్రజల్లో బీజేపీ హైలెట్ అవుతోంది.
బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణ నేతలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఆపార్టీ నేతలు టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం అయ్యాక బీజేపీ నేతల్లో మరింత జోష్ పెరిగినట్లు తెలుస్తోంది. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. సచివాలయ కూల్చివేత విషయంలోనూ బీజేపీ తీవ్ర రాద్దాంతం చేస్తోంది.
కేసీఆర్ చరిష్మాకు.. కరోనా చెక్ పెట్టిందా?
ఇటీవల బీజేపీ ఎంపీ అరవింద్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేసిన విషయంలోనూ ప్రభుత్వాన్ని బీజేపీ కార్నర్ చేసింది. రోజురోజుకు బీజేపీ తెలంగాణలో బలపడుతుందని గ్రహించిన దీనికి విరుగుడు రెడీ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పుడు తమకు ఇంతటి ఇబ్బందులు తలెత్తలేదని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకుంటున్నారు.
దీంతో బీజేపీ దూకుడు తగ్గించేలా కేసీఆర్ కాంగ్రెస్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. గతకొంత కాలంగా కాంగ్రెస్ విమర్శలను పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు ఆ పార్టీ చేస్తున్న విమర్శలకు వెంటనే స్పందిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ చేస్తున్న విమర్శలను లైట్ తీసుకుంటున్నారు. అనవసరంగా బీజేపీ చేసే విమర్శలకు స్పందిస్తే ఆపార్టీ హైలెట్ అవుతుందనే భావిస్తున్నారట.
ఇందులో భాగంగా కాంగ్రెస్ చేపట్టే ధర్నాలు, ఆందోళనలకు సులువుగా అనుమతులు ఇచ్చేలా అధికారులకు అనధికారికంగా ఆదేశాలిచ్చిట్లు ప్రచారం జరుగుతుంది. ఇలా కాంగ్రెస్ ప్రాధాన్యం పెంచి బీజేపీ దూకుడుకు కళ్లెంవేసేలా కేసీఆర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.