ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర సీఎం రెగ్యులర్‌గా పోలీసులతో సమావేశాలు పెడుతున్నారు. తాజాగా.. ఈరోజు కూడా మరోసారి మీట్ అవుతున్నారు. డీజీపీ, ఆయా విభాగాల అధిపతులతో తరచూ సమావేశం పెడుతున్న సీఎం కేసీఆర్.. ఈ సారి డీజీపీ, ఎస్పీ స్థాయి ఆఫీసర్లతో మాత్రం మూడేళ్ల తర్వాత భేటీ అవుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: కేసీఆర్.. జగన్ ల జల జగడం ఎటు దారితీస్తుంది?
అయితే.. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఎస్పీ స్థాయి ఆఫీసర్లతో సమావేశం నిర్వహించని ఇప్పుడు పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టుల అంశమే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరుగబోతున్నట్లు వినిపిస్తోంది. ఇటీవల నెలల వ్యవధిలోనే తెలంగాణలో మావోయిస్టుల కదలికలు బయటపడ్డాయి. రోజుల వ్యవధిలో వేర్వేరు ప్రాంతాల్లో ఐదు ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. వీటన్నింటితోపాటు మావోయిస్టు అగ్ర నేతలు కొందరు లొంగిపోతారనే ప్రచారం కూడా జరిగింది. ఏకంగా డీజీపీ స్వయంగా మన్యం బాటపట్టి రోజుల తరబడి అక్కడే ఉండి, పరిస్థితుల్ని పరిశీలించారు. ఎప్పుడూ లేని విధంగా ఆసిఫాబాద్‌లో నాలుగు రోజుల పాటు మకాం వేశారు. చివరకు ఏం తేల్చకుండానే వెనుదిరిగారు.
అటు పోలీసులు.. ఇటు మావోయిస్టుల మధ్య వార్ నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మన్యంలో పోలీసులు అనుసరిస్తున్న వ్యూహాలు, అడవుల్లో గాలింపుపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోకి ప్రవేశించిన మావోయిస్టు నేతలు, మావోయిస్టు పార్టీ ప్రస్తుత పరిస్థితి.. తెలుసుకునే అవకాశాలూ ఉన్నాయట. మావోయిస్టుల్ని అడ్డుకునే చర్యల్లో భాగంగా ఇటీవల జరిగిన కేంద్ర హోంశాఖ సలహాదారు విజయ్‌కుమార్, ఛత్తీ్‌స్‌గఢ్, సీఆర్‌పీఎస్, బీఎస్‌ఎఫ్ తదితర విభాగాల అధికారులతో జరిగిన సమావేశం తీసుకున్న నిర్ణయాలు, అనుసరించాల్సిన విధానాల పైనా సీఎం చర్చించనున్నట్లు, పోలీసు శాఖకు మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సమాచారం. ప్రధానంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారని తెలుస్తోంది.
Also Read: దుబ్బాకలో త్రిముఖ పోరు.. బరిలో గెలిచేదెవరు?
వీటితోపాటే.. రాష్ట్రంలో శాంతిభద్రతల పైనా సీఎం ఆరా తీయనున్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం, కరోనా బారినపడ్డవారు, ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు అందించాల్సిన పరిహారంపై కూడా అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారట. దీంతోపాటు కలప అక్రమ రవాణా, అటవీ భూముల ఆక్రమణ, వణ్యప్రాణుల సంరక్షణ ఇతర అంశాలకు సంబంధించి అటవీ శాఖ అధికారులతోనూ ముఖ్యమంత్రి చర్చిస్తారు.