KCR vs Congress : తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. సోనియాగాంధీకి రుణపడి ఉంటామని చెప్పింది కేసీఆర్. కాంగ్రెస్ పార్టీలో భారత రాష్ట్ర సమితిని విలీనం చేస్తామని చెప్పింది కూడా కేసీఆరే. తెలంగాణ ఏర్పాటు జరిగింది కానీ… మిగతావేవీ జరగలేదు. పైగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని కుక్కలు చింపిన విస్తరి చేశాడు కేసీఆర్. ఇంత జరిగినప్పటికీ కాంగ్రెస్ నాయకులకు ఏమాత్రం రోషం ఉండదు. పైగా ప్రగతి భవన్ కు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటారు. రేవంత్ రెడ్డి లాంటి నాయకుడిని దింపేసేందుకు ఏకంగా మంతనాలు కూడా చేస్తారు. ఆ మధ్య దళిత బంధు ప్రోగ్రాం మొదలైనప్పుడు భట్టి విక్రమార్క ప్రగతి భవన్ వెళ్లారు.. అది అప్పట్లో సంచలనం సృష్టించింది. తర్వాత పలు సందర్భాల్లో భట్టి విక్రమార్క కెసిఆర్ ఫోల్డ్ లో ఉన్నట్టే మాట్లాడారు. ఈ విషయం చాలామందికి కొరుకుడు పడేది కాదు.. పైగా భట్టి విక్రమార్కకు ప్రగతి భవన్ చాలా క్లోజ్ అని పాత్రికేయ వర్గాలు చెప్పుకుంటాయి.

ఇక మొన్న కొత్తగూడెంలో కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి కేసీఆర్ వెళ్లారు. ఆ జిల్లాకే చెందిన భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్యకు ఆహ్వానం అందలేదు. పైగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఖమ్మంలో కూడా అదే పరిస్థితి.. కాంగ్రెస్ నాయకులు అయితే వారి జిల్లా కార్యాలయంలోనే ఉంచి గేటుకు తాళం వేశారు. కానీ యాదృచ్ఛికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విక్రమార్కను పోలీసులు ఏమీ అనలేదు.. ఆయన ఖమ్మం కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఎమ్మెల్యేకు దక్కని ఆహ్వానం భట్టి విక్రమార్కుకు ఎలా దక్కింది? వీరయ్య ను పిలవని అధికార పార్టీ నాయకులు.. విక్రమార్కను ఎలా పిలిచారు? ఈ ప్రశ్నలకు కేసీఆరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ప్రతిపక్షాల్లో అనైక్యతను సృష్టించి రాజకీయాలు చేయడంలో కెసిఆర్ దిట్ట.. ఇటీవల రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లు నిరసన గళం విప్పడం వెనుక కూడా కేసీఆర్ ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవాల్టికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. దాన్ని చీల్చేందుకు కేసిఆర్ చేయని ప్రయత్నాలు అంటూ లేవు. ఆయన పాచికలు పారకపోవడంతో భట్టి విక్రమార్క ద్వారా కాంగ్రెస్ లో చీలిక తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆలస్యంగా మేల్కొన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీనియర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు ఈరోజు జరిగిన సభలో భట్టి విక్రమార్క కేసీఆర్ తో పిచ్చాపాటిగా మాట్లాడారు.. నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రం ఇస్తామని పేరుకు చెప్పినప్పటికీ… కంటి వెలుగు, కలెక్టరేట్ ప్రారంభోత్సవం వరకు అక్కడే ఉన్నారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు తన అధికారం కోసం కేసీఆర్ ఎలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారో… ఇలాంటి విధానాలతో దేశంలో గుణాత్మక మార్పు తీసుకొస్తామని కేసీఆర్ చెప్పడం… వేదాలు వల్లించినట్టే ఉంది.. అన్నట్టు ఈరోజు బహిరంగ సభలో వామపక్ష పార్టీల నాయకులను ప్రగతిశీల శక్తులు అని కెసిఆర్ సంబోధించడం గమనార్హం..