CM KCR: తెలంగాణ రాజకీయాల్లో అపర చాణక్యుడగా పేరున్న కేసీఆర్.. ఏది చేసినా భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే చేస్తారు. ఈ విషయం గతంలో జరిగిన అనేక ఘటనలను చూస్తేనే అర్థం అవుతుంది. అయితే గత కొంత కాలంగా తెలంగాణలో మళ్లీ ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కేసీఆర్ మరోసారి ముందస్తు వ్యూహాన్ని అనుసరిస్తారని ఎంతోమంది చెబుతున్నారు. అయితే ఇప్పుడు వారందరినీ డైలమాలో పడేశారు కేసీఆర్.

తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ మీద మాట్లాడిన కేసీఆర్.. తీవ్ స్థాయిలో విమర్శించారు. ఇలాంటి కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటూ వెల్లడించారు. కాగా ఇదే సమయంలో తాను జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇలా రాజకీయాల మీద అనేక విషయాలు మాట్లాడిన కేసీఆర్.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని చెప్పేశారు.
Also Read: CM KCR Plan: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ గేమ్ ప్లాన్?
గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని.. తమ పార్టీ ముందస్తుకు వెళ్లబోదంటూ ఓ క్లారిటీ అయితే ఇచ్చేశారు. కాగా ఇదే సమయంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామంటూ.. ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఇక్కడే ప్రతిపక్షాలను డైలమాలో పడేస్తున్నారు కేసీఆర్. ముందస్తుకు వెళ్లకపోతే ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించడం ఎందుకంటూ ప్రతిపక్షాలు, మీడియా ఆలోచనలో పడ్డాయి.
గతంలో కూడా ఒకేసారి అభ్యర్తులను ప్రకటించి, ఎన్నికల సైరన్ మోగించారు. ఆ సమయంలో కనీసం ప్రతిపక్షాలకు ఆలోచించుకునేంత సమయం కూడా ఇవ్వకుండా దెబ్బ తీశారు. కాబట్టి ఇప్పుడు మరోసారి ఇలాంటి వ్యూహాన్నే అమలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంటే తనను ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలు మరింత కసరత్తు చేయాల్సిందే అంటూ ప్రతిపక్షాలకు కొత్త టార్గెట్లను ఫిక్స్ చేస్తున్నారు కేసీఆర్. తానే ట్రెండ్ సెట్ చేసి ప్రతిపక్షాలు ఫాలో అయ్యేలా చేస్తున్నారన్న మాట. ఏదేమైనా కేసీఆర్ వ్యూహాలు అంత ఈజీగా ఎవరికీ అర్థం కావు కదా.