
తెలంగాణ రాజకీయంలో ఒక మంత్రి, ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు.. ఇలా అందరూ తమ తరువాత తమ వారుసులే రాజకీయాల్లోకి రావాలని.. వారే అధికారం చేపట్టాలని కలలుగంటున్నారు. అదే ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికి.. యువతకు మార్గాలను లేకుండా చేస్తోందన్న ఆవేదన ఉంది.
Also Read: దేవుడి కోసం టీఆర్ఎస్ లో ఫైట్?
టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని విపక్షాలు విమర్శిస్తూనే ఉంటాయి. కానీ కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోంది. అయితే ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ ఇప్పుడు తెలంగాణలో ఔత్సాహికులైన సొంతగా ఎదిగే నేతలను ఎదగనీయకుండా చేస్తోంది.. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ కుటుంబ సభ్యులను తెరమీదకు తీసుకొచ్చి పాగా వేయాలని అడుగులు వేస్తున్నారు..
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడీ సంస్కృతి బాగా పెరిగిపోతోంది. కేసీఆర్ తన రాజకీయ వారసుడు కేటీఆర్ ను తెలంగాణలో ఫోకస్ చేస్తున్నారు. అయితే కేటీఆర్ సీఎం అయితే అంతా యువ జట్టును ఎన్నుకుంటాడని.. తమకు పదవులు రావనే భయం టీఆర్ఎస్ సీనియర్లను వెంటాడుతోంది. ఈ క్రమంలోనే కేటీఆర్ పగ్గాలు చేపట్టేనాటికి తమ వారసులను రాజకీయ అరంగేట్రం చేయించాలని పాత సీనియర్ నేతలంతా భావిస్తున్నారు.
ఇప్పుడు టీఆర్ఎస్ లో చాలా మంది సీనియర్లు, వృద్ధ నాయకులు పార్టీలో తమ వారసులను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలోనే వారంతా కేటీఆర్ ను కలిసే పనిలో బిజీగా ఉన్నారు. వారి కుమార్తెలు, కుమారులు, మేనల్లుళ్లను కేటీఆర్ కు పరిచయం చేస్తున్నారు. వారికి తగిన పార్టీ పదవుల కోసం లాబీయింగ్ మొదలుపెడుతున్నారు. ఇప్పటికే కేటీఆర్ దృష్టిని ఆకర్షించడానికి పలువురు నాయకులు అనేక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలకు కేటీఆర్ ను ఆహ్వానిస్తూ మెప్పు పొందడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
Also Read: రాజకీయాల్లో రేణుక ప్రస్థానం ముగిసినట్లేనా?
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ స్థానాల్లో తమ వారసులకు టికెట్లు లభించేలా నేతలు కేటీఆర్ నుంచి హామీ తీసుకుంటున్నారు. ఇక కేటీఆర్ కూడా రాజకీయ వారసులను ఆహ్వానిస్తూ ఆ కుటుంబాలకు హామీలు ఇస్తున్నాడని తెలిసింది. ప్రస్తుతం ఈ వారసత్వ రాజకీయాలు టీఆర్ఎస్ లో విస్తృతంగా సాగుతున్నాయి. కేసీఆర్ కూడా వీటిని ప్రోత్సహిస్తూ కుమారుడికి లైన్ క్లియర్ చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
-నరేశ్ ఎన్నం