హరీశ్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేసీఆర్?

టీఆర్ఎస్ లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇన్నాళ్లు పక్కన పెట్టిన కేసీఆర్ ఇక లాభం లేదనుకుని ప్రతి పనిలో ఆయన సహకారం తీసుకుంటున్నారు. దీంతో పార్టీలో హరీశ్ ప్రస్థానం పెరిగిందనే చెప్పాలి. మొదటి సారి గెలిచినప్పుడు ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చారు. రెండోసారి విజయం సాధించినప్పుడు మాత్రం ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. దీంతో ఆయన బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు […]

Written By: Srinivas, Updated On : June 18, 2021 8:08 pm
Follow us on

టీఆర్ఎస్ లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇన్నాళ్లు పక్కన పెట్టిన కేసీఆర్ ఇక లాభం లేదనుకుని ప్రతి పనిలో ఆయన సహకారం తీసుకుంటున్నారు. దీంతో పార్టీలో హరీశ్ ప్రస్థానం పెరిగిందనే చెప్పాలి. మొదటి సారి గెలిచినప్పుడు ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చారు. రెండోసారి విజయం సాధించినప్పుడు మాత్రం ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. దీంతో ఆయన బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. కానీ హరీశ్ మాత్రం తాను బతికున్నంత వరకు టీఆర్ఎస్ లో ఉంటానని తేల్చి చెప్పారు.

ఈటల రాజేందర్ పార్టీకి దూరమయ్యాక ఆయన స్థానాన్ని హరీశ్ భర్తీ చేస్తున్నారు. తెలంగాణలో ఆస్పత్రుల అభివృద్ధికి వేసిన సబ్ కమిటీకి హరీశ్ రావే నేతృత్వం వహించడం విశేషం. ఈటల తొలగింపు తర్వాత ఆరోగ్య శాఖ విషయంలో కూడా హరీశ్ మాటే చెల్లుబాటు అవుతోంది. ఆరోగ్య శాఖను సీఎం తన వద్దే ఉంచుకున్నా పర్యవేక్షణ బాధ్యతలు మాత్రం హరీశ్ రావుకు అప్పగించారు. దీంతో ఆయన పార్టీలో ప్రముఖంగా నిలుస్తున్నారు. ఇటీవల మీడియా కూడా ఆయన చుట్టూ తిరుగుతోంది.

హుజురాబాద్ లో ఈటలకు చెక్ పెట్టాలంటే సమర్థుడైన నాయకుడి కోసం కేసీఆర్ అన్వేషిస్తుండగా హరీశ్ రావే అందుకు తగిన వాడిగా గుర్తించి ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక భారం మొత్తం హరీశ్ పైనే ఉంచారు. ఉద్యమ నేతగా ఎదిగిన హరీశ్ ఈటలను ఎదుర్కొంటాడనే నమ్మకంతో ఆయనపై బాధ్యతలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈటల రాజీనామాతో హరీశ్ రావుకు టీఆర్ఎస్ లో సముచిత స్థానం దక్కిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

హుజురాబాద్ ఉప ఎన్నికపై హరీశ్ రావు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈటలపై ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బీసీ నేతల కోసం వ్యూహాలకు పదును పెడుతున్నారు. విజయం సాధించేందుకు కావాల్సిన యుక్తులను వెతుకుతున్నారు. హుజురాబాద్ పై టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని భావిస్తున్నారు.