KCR First List: త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల వివరాలను ప్రకటించారు. కొన్ని కొన్ని మార్పులు, చేర్పులు మినహా కెసిఆర్ పెద్దగా ప్రయోగాల జోలికి పోలేదు. కొన్ని నియోజకవర్గాలకు కొత్త ముఖాలను పరిచయం చేశారు. రెండు స్థానాల్లో వారసులకు టికెట్లు ఇచ్చారు. అయితే ఇందులో ఒక నలుగురికి టికెట్లు రావడం మాత్రం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యమంత్రి ఇలా ఎలా చేస్తారంటూ విస్మయం కూడా కలుగుతోంది. ఇంతకీ ఆ స్థాయిలో చర్చ జరగడానికి ప్రధాన కారణం ఇదే.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెరపైకి వచ్చింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి(తర్వాత వీరు భారత రాష్ట్ర సమితిలో చేరారు), భారత రాష్ట్ర సమితి టికెట్ మీద గెలిచిన గువ్వల బాలరాజు కు పార్టీ ఫిరాయించేందుకు కొంతమంది వ్యక్తులు 100 కోట్లతో డీల్ మాట్లాడారని, మొయినా బాద్ లోని ఓ ఫామ్ హౌస్ కేంద్రంగా ఈ వ్యవహారం సాగిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కెసిఆర్ తీవ్రంగా స్పందించారు. భారతీయ జనతా పార్టీ ఎంతకైనా తెగిస్తుందని ఆరోపించారు. దీనిని సాకుగా చూపి ఆయన మునుగోడు ఎన్నికల్లో ఓటర్ల సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. ఆ ఎన్నికలో కమ్యూనిస్టుల సపోర్టుతో తన పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకున్నారు. అంతేకాదు అప్పుడు ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొన్నారు. బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజును ప్రత్యేకంగా తన ఫామ్ హౌస్ లోనే ఉంచుకున్నారు. ఎన్నికల ప్రచారంలో వారిని కూడా తీసుకెళ్లారు. వారిని తెలంగాణ హీరోలుగా ప్రకటించుకున్నారు..
అయితే ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నవారే. సొంత పార్టీ క్యాడర్ కూడా వీరి నాయకత్వాన్ని అంతగా ఇష్టపడటం లేదు. పైలట్ రోహిత్ రెడ్డికి వ్యతిరేకంగా పట్నం మహేందర్రెడ్డి వ్యవహరిస్తున్నారు. రోహిత్ రెడ్డికి టికెట్ ఇస్తే తాను స్వతంత్రంగా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. రేగా కాంతారావు స్థానిక నాయకత్వాన్ని పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. రేగా ఒంటెద్దు పొగడలపై నేరుగా ముఖ్యమంత్రి కే ఫిర్యాదులు వెళ్లాయి. హర్షవర్ధన్ రెడ్డి పరిస్థితి కూడా దాదాపుగా ఇదేవిధంగా ఉంది. బాలరాజు పలు వివాదాస్పద విషయాల్లో వేలు పెట్టి పార్టీకి ఇబ్బంది కలిగించారు. అయితే వీరికి టికెట్ కెసిఆర్ ఇవ్వరు అని అందరూ అనుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల వరకే వీరిని ప్రగతి భవన్, భారత రాష్ట్ర సమితిలో ఉంచుకుంటారని ప్రచారం జరిగింది. తర్వాత ఎన్నికల సమయంలో అదును చూసి వీరిని బయటకు వెళ్లగొడతారని రకరకాల కథనాలు వినిపించాయి. కానీ ఈ నలుగురికి ముఖ్యమంత్రి టిక్కెట్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎవరికి క్యాడర్ ఏ మేరకు సహకరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.