CM KCR: రాజకీయాల్లో అప్పటి వరకు అవసరాలు మాత్రమే ఉంటాయి. ఒక్కసారి ఆ అవసరాలు తీరాయా ఇంకా అంతే సంగతులు.. అది ఏ పార్టీ అయినా సరే ఇదే విధానాన్ని అనుసరిస్తుంది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అతీతం కాదు. తన అవసరం తీరేవరకే ఆ పార్టీలతో ఉన్నారు. ఆ తర్వాత కటీఫ్ చెప్పి తన దారి తను చూసుకున్నారు. ఉద్యమ సమయంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, తెలుగుదేశం పార్టీతో కెసిఆర్ అంటకాగారు. ఎన్నికల ముగిసిన తర్వాత తన దారి తను చూసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కెసిఆర్ తన రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఎన్నడూ లేనిది కమ్యూనిస్టు పార్టీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. వారితో గంటలపాటు సమావేశాలు నిర్వహించారు. చివరికి మునుగోడులో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నామని వారితోనే చెప్పించారు. తన సొంత పత్రిక నమస్తే తెలంగాణలో వారికి పతాకస్థాయి ప్రచారం దక్కేలా చూశారు. సీన్ కట్ చేస్తే మునుగోడు ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గెలిచారు. కానీ అప్పటిదాకా కమ్యూనిస్టులకు ప్రయారిటీ ఇచ్చిన నమస్తే తెలంగాణ ఆ తర్వాత వారిని పట్టించుకోవడం మానేసింది. ఇది సహజంగానే కమ్యూనిస్టులకు కొత్త ఇబ్బంది కలిగించింది. నమస్తే తెలంగాణ అంటే పత్రిక కాబట్టి కమ్యూనిస్టులు పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటుంది కాబట్టి త్వరలో జరగబోయే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి మునుగోడు ఎన్నికలలో లాగానే మద్దతు కోసం తమ వద్దకు వస్తుందని కమ్యూనిస్టు పార్టీలు అనుకున్నాయి. కానీ ఈరోజు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కమ్యూనిస్టులకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా ముఖ్యమంత్రి ఇవ్వలేదు.
ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గెలిచాడు అంటే దానికి కారణం కమ్యూనిస్టులకు ఉన్న ఓటు బలమే. అప్పుడు తన అవసరం కాబట్టి కెసిఆర్ వారితో అంట కాగారు. ఆ తర్వాత కొన్ని సీట్లు కేటాయిస్తామని సంకేతాలు ఇచ్చారు. దీంతో కమ్యూనిస్టు నాయకులు జబ్బలు చరుచుకున్నారు. మోడీని ఎదుర్కొనే దమ్ము కేసిఆర్కే ఉందని అప్పట్లో ఆకాశానికి ఎత్తేశారు. కానీ అవసరం తీరిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని తన దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. సరి కదా తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కమ్యూనిస్టులను ఏమాత్రం లెక్కలోకి తీసుకోలేదు. నాగార్జునసాగర్, మునుగోడు, కొత్తగూడెం, పాలేరు, వైరా, భద్రాచలం అసెంబ్లీ సీట్లను తమకు కేటాయిస్తారని కమ్యూనిస్టు నాయకులు అనుకున్నారు . కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ నియోజకవర్గాలలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను ప్రకటించారు. దీంతో షాక్ కు గురి కావడం కమ్యూనిస్టులవంతయింది. అయితే కమ్యూనిస్టులు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారనే ప్రచారంతోనే కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని భారత రాష్ట్ర సమితి వర్గాలు అంటున్నాయి.