
Ponguleti Srinivasa Reddy- Jupally Krishna Rao: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డికి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు కెసిఆర్ షాక్ ఇచ్చారు. వారిద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్న నేపథ్యంలో వారిపై ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారత రాష్ట్ర సమితి ప్రకటించింది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ సస్పెండ్ అంశం హాట్ హాట్ చర్చకు దారి తీస్తోంది.
కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధిష్టానం పై ఆగ్రహంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ టికెట్ తనకు కాకుండా నామ నాగేశ్వరరావుకి ఇవ్వడంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అప్పటినుంచి పార్టీ కార్యకలాపాల్లో అంతగా పాల్గొనడం లేదు. మధ్యలో కేటీఆర్ వచ్చి నచ్చ చెప్పినప్పటికీ పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తారని ఆశపడినప్పటికీ చివరికి అది కూడా తాతా మధుకు దక్కింది. ఇలా అయితే లాభం లేదనుకున్నాడో ఏమో తెలియదు కానీ పొంగులేటి పార్టీ నుంచి బయటికి వచ్చేసాడు. అధిష్ఠానానికి వ్యతిరేకంగా స్వరం పెంచడం మొదలుపెట్టాడు. దీనికి తోడు తన వర్గం నాయకులను తన వైపు ఉండేలా చేసుకున్నాడు. మార్క్ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎర్రుపాలెం జడ్పిటిసి, వైరా మున్సిపల్ చైర్మన్ ఇలా చాలామంది పొంగులేటి వెంట నడుస్తున్నారు..దీనికి తోడు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి తన సత్తా చాటుతున్నారు. అంతేకాకుండా అశ్వరావుపేట నియోజకవర్గానికి తన అభ్యర్థిగా జారే ఆదినారాయణ, నియోజకవర్గానికి వైరా నియోజకవర్గానికి బానోతు విజయా బాయిని ప్రకటించి సంచలనం రేకెత్తించారు.
ఇక నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావును కూడా పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. జూపల్లి కృష్ణారావు వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈయన 2018 ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీరం భారత రాష్ట్ర సమితిలో చేరారు. దీంతో కృష్ణారావుకు, హర్షవర్ధన్ రెడ్డికి విభేదాలు మొదలయ్యాయి. ఇటీవల తారస్థాయికి చేరాయి. దీంతో కృష్ణారావును కేటీఆర్ పిలిపించుకొని మాట్లాడారు. అప్పటికి ఉపయోగం లేకపోవడంతో కృష్ణారావు పార్టీ వ్యతిరేక స్వరాన్ని మరింత తీవ్రతరం చేశారు. ఆదివారం భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పట్టణంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి కృష్ణారావు తన అనుచరులతో కలిసి హాజరయ్యారు. వీరిద్దరూ కలిసి అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడారు. కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న భారత రాష్ట్ర సమితి అధిష్టానం పొంగులేటి శ్రీనివాస రెడ్డిని, కృష్ణా రావును సస్పెండ్ చేసింది.

కేవలం వీరిద్దరు మాత్రమే కాకుండా చాలామంది నాయకులు అధిష్టానానికి వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నారని తెలిసింది. ఎన్నికల నాటికి ఇది మరింత పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇలాంటి వారికి భారతీయ జనతా పార్టీ గాలం వేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా చేరికల కమిటీకి చైర్మన్ గా ఉన్న ఈటల రాజేందర్ భారత రాష్ట్ర సమితి అసంతృప్త నేతలతో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు కృష్ణారావుతో కూడా ఒకటి రెండుసార్లు మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది.