KCR vs BJP: “కూరిమి గల దినంబులలో నేరములు ఎన్నడూ కలగనేరవు.. ఆ కూరిమే విరసంబైనన్ నేరములే కలుగుచుండు నిక్కము సుమతీ”! అంటకాగినప్పుడు.. బిల్లులకు మద్దతు ఇచ్చినప్పుడు బిజెపి, టిఆర్ఎస్ మధ్య సఖ్యత బాగానే ఉంది. ఒకరిని ఒకరు పొగుడుకున్నారు.. భగీరథ స్కీం ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు. 2019 ఎన్నికల్లో ఎప్పుడైతే బిజెపి నాలుగు ఎంపీ స్థానాలు గెలిచిందో, అన్నింటికంటే ముఖ్యంగా తన బిడ్డ మీద బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిచాడో అప్పుడే టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కత్తి, డాలు తీసుకొని బయలుదేరాడు. అప్పుడు మొదలు ఇప్పటిదాకా బిజెపి, టిఆర్ఎస్ మధ్య నిత్య వైరం జరుగుతూనే ఉంది. ఈ వైరానికి దుబ్బాక, హుజురాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మునుగోడు ఎన్నికలు మరింత ఆజ్యం పోశాయి. మాటలు దాటి ఇప్పుడు దాడుల వరకు వెళ్లాయి. ముందు ముందు పరిస్థితులు ఎటు దారితీస్తాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

కెసిఆర్ ఢీ అంటే ఢీ
కేంద్రంతో కేసీఆర్ తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధమైనట్టు కనిపిస్తోంది. అందుకే వీలు చిక్కినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండ గడుతున్నాడు. ప్రధానమంత్రి నాలుగు సార్లు హైదరాబాద్ వచ్చినప్పుడు తమ పార్టీ కార్యకర్తల ద్వారా నిరసన వ్యక్తం చేయించాడు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం లేకుండా చేశాడు. ప్రధానమంత్రి మోడీ సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన నాడు ఆగమేఘాల మీద బెంగళూరు ప్రోగ్రాం పెట్టుకున్నాడు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టుకున్న నాడు విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పరిచయ కార్యక్రమం అట్టహాసంగా చేశాడు.. ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకున్నందుకు కేబినెట్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పంపించాడు. ఇలా ఎటు చూసుకున్నా కూడా కేంద్రంతో యుద్ధమే అనే సంకేతాలు కేసీఆర్ పంపాడు.
మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసులోనూ..
మునుగోడు ఉప ఎన్నికల ముందు మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసు తెరపైకి వచ్చింది. 2015 లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటుకు నోటు కేసులో దొరికినంత ఫాయిదా ఈ కేసులో కెసిఆర్ కు దక్కలేదు. జాతీయ మీడియా లైట్ తీసుకుంది. రాష్ట్ర మీడియా లో ఓవర్గం మాత్రమే కోడై కోసింది. సాక్షాత్తు ఏసీబీ కోర్టు జడ్జి సర్కారుకు చివాట్లు పెట్టాడు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీల్డ్ కవర్లో పెన్ డ్రైవ్, కేసుకు సంబంధించిన ఆధారాలు ముఖ్యమంత్రి పంపిస్తే.. ఇవి ఎక్కడ పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదికి చివాట్లు పెట్టాడు.. ఇలా సాగుతుండగానే జాతీయ మీడియాలో మరింత ఫోకస్ కావాలనే ఉద్దేశంతో.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బృందం బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు బిఎల్ సంతోష్ కు నోటీసు పంపింది. భారతీయ జనతా పార్టీలో నెంబర్ 2 గా కొనసాగుతున్న బిఎల్ సంతోష్ తెర పైన కనిపించడం చాలా అరుదు. చాలా సౌమ్యుడిగా పేరు ఉంది. వివాదరహితుడని కూడా అంటారు. అయితే అతడిని ఈ కేసులోకి లాగడం ద్వారా మరింత ఫోకస్ కావాలని కెసిఆర్ ఆలోచనగా ఉంది.

జాతీయంగా ఫోకస్ కావాలనే ఉద్దేశంతోనే
టిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా అవతరించే క్రమంలో ఒక గట్టి ఇష్యూ ని ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో భాగంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసును కేసీఆర్ చాకచక్యంగా బయటకు తీసుకొచ్చారని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆయన అనుకున్నంత ఫాయిదా ఇందులో లేదు. ఒకవేళ ఈ కేసులో గనుక అంత స్టఫ్ ఉండి ఉంటే జాతీయ మీడియా ఊరుకునేది కాదు. ఇందులో ఉన్న బొక్కలు కూడా కేసీఆర్ కు తెలుసు. మీడియా అటెన్షన్ కోసం కేసిఆర్ చేయాల్సినవన్నీ చేస్తున్నారు. కానీ ఎక్కడో తేడా కొడుతోంది.. ఇక తాజా పరిణామాలు చూస్తుంటే కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు కేసిఆర్ సిద్ధపడ్డారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక బిజెపి కూడా తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ధర్మపురి అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ కార్యకర్తల దాడిని తిప్పికొట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. అయితే ఇప్పుడు ఈ ఆటలో గవర్నర్ జోక్యం చేసుకొని ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డిజిపిని కోరారు. దీంతో ఈ వ్యవహారం మరింత రంజుగా మారింది. చూస్తుంటే తెలంగాణ కూడా మరో పశ్చిమబెంగాల్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.