KCR-BJP: కేంద్రంలోని బీజేపీ సర్కాన్‌ను గద్దె దించడమే తన లక్ష్యం అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. మహారాష్ట్ర నుంచి జాతీయ రాజకీయాలు మొదలు పెట్టారు. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరిస్తానని ప్రతిన బూనారు. మోదీని గద్దె దించుతానని, బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతానని శపథం చేశారు. కానీ చివరకు.. రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయారు గులాబీ బాస్. అటు విపక్ష కూటమిలో చేరక.. ఇటు బీజేతో సఖ్యత లేక ఎటూ కాకుండా పోయే పరిస్థితి నెలకొంది. తాజాగా బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు గురువారం మరోమారు సమావేశమయ్యాయి. ఈభేటీకి కేసీఆర్ మళ్లీ డుమ్మా కొట్టారు. దీంతో కేసీఆర్ బీజేపీతో యుద్ధంపై కేసీఆర్ యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.
జాతీయ రాజకీయాలకు దూరంగా..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నాళ్లుగా జాతీయ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. విపక్షాల భేటీలకు అసలు హాజరు కావడం లేదు. అయితే కేసీఆర్ హాజరుపై బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ మాత్రం రెండు రోజులకిందట ఓ ప్రకటన చేశారు. విపక్షాల మీటింగ్‌కు కేసీఆర్‌వెళ్తారని ప్రకటించారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. నిజంగా కేసీఆర్ పట్నా మీటింగ్‌కు వెళ్తున్నారా అని ఆరా తీయడం ప్రారంభించారు.
మళ్లీ డుమ్మా కొట్టిన గులాబీబాస్..
బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని విపక్షాలను ఒకేతాటికి తీసుకువచ్చేందుకు, లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు నితీశ్‌కుమార్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు అయింది. దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు జరిగే విపక్ష సదస్సుకు బీజేపీని వ్యతిరేకించేవారంతా రావాలని పిలుపునిస్తున్నారు.
పాట్నాలో జూన్ 22న నిర్వహించిన విపక్షాల భేటీకి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ డుమ్మా కొట్టారు. ఈ భేటీకి బిహార్ సీఎం నితీశ్, బెంగాల్ సీఎం మమత బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకె నేత ఎంకే.స్టాలిన్ కూడా హాజరయ్యారు.
రాజీ మార్గమే రాజమార్గమని..
తెలంగాణలో ఇటీవల బీజేపీతో కేసీఆర్ రాజీ తరహా వైఖరి అవలంభించడంతోం బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. గతంలో ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉన్న రాజకీయాలు మారిపోయాయి. బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య సీక్రెట్ ఒప్పందం ఉందని.. రెండూ ఒకేటనన్న ప్రచారం జరగడంతో ఎక్కువగా బీజేపీ నష్టపోతోంది. పార్టీలో చేరేవారులేకపోగా ఉన్నవారు.. కూడా పక్క చూపులు చూస్తున్నారు. దీంతో కేసీఆర్ అదే సంప్రదాయం కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.