
KCR- Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈమేరకు పీఎంవో నుంచి షెడ్యూల్ విడుదలైంది. శనివారం హైదరాబాద్‌కు వస్తున్న మోదీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాల్గొంటారా లేదా అన్న చర్చ మళ్లీ మొదలైంది. కేసీఆర్ హాజరు అనుమానమే అని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవే ప్రధానికి స్వాగతం పలుకుతారని తెలుస్తోంది.
మోదీకు ముఖం చూపిచని కేసీఆర్..
తెలంగాణ సీఎం కేసీఆర్ 2018 ఎన్నికల వరకు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో సత్సంబంధాలు కొనసాగించారు. 2019 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ మొదలైంది. కరోనా సమయంలో ఇది మరింత తీవ్రమైంది. కోవిడ్ వ్యాక్సిన్ తయారీ కోసం మోదీ హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు వచ్చారు. ఈ సమయంలో కేసీఆర్‌ను ఆహ్వానించలేదు. ఆతర్వాత ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రం, రాష్ట్రం మధ్య యుద్ధమే జరిగింది. వరేస్తే ఉరే అని కేసీఆర్, తర్వాత బాయిల్డ్ రైస్ కొనమని కేంద్రం చెప్పడం రైతులను ఆందోళకు గురిచేసింది. ఈ క్రమంలో మొదలైన దూరం క్రమంగా పెరుగూత వచ్చింది. తర్వాత మూడుసార్లు మోదీ రాష్ట్రానికి వచ్చారు. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం ఆయనను కలవలేదు. ప్రధానిపై తీవ్ర పదజాలం ప్రయోగించిన కేసీఆర్ తర్వాత మోదీకి ముఖం చూపించలేకపోతున్నారన్న చర్చ జరుగుతోంది. రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా.. అభివృద్ధి విషయంలో కలిపి పనిచేస్తారు. కేసీఆర్ మాత్రం మోదీకి ముఖం చూపించలేకపోతున్నారు.
తాజా పర్యటనకూ దూరం?
తాజాగా మోదీ పర్యటనపై పీఎంవో విడుదల చేసిన షెడ్యూల్ లో కేసీఆర్ కూడా పాల్గొంటారని ఉంది. ఎనిమిదో తేదీ ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లనున్నారు. ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ∙ప్రారంభించనున్నారు. తరువాత మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకోనున్నారు. ప్రధాని అధికారిక పర్యటన నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 12.37 గంటల వరకు కేసీఆర్ కు మాట్లాడేందుకు సమయం కేటాయించారు. అనంతరం మధ్యాహ్నం 12.50 గంటల నుంచి 1.20 గంటల వరకు ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అభివృద్ధి పనులు అధికారికం. అందుకే కేసీఆర్‌నూ ఆహ్వానించి .. ప్రసంగించేందుకు సమయం కూడా ఇచ్చారు. అయితే కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది మాత్రం ఇంకా స్పష్టత లేదు.

సంప్రదించాకే కేసీఆర్ పేరు..
అయితే సీఎంవోను సంప్రదించకుండా ఇలా కేసీఆర్ పేరు పెట్టే అవకాశం లేదని ప్రోటోకాల్ గురించి తెలిసిన వారు అంచనా వేస్తున్నారు. గతంలో ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ స్వాగతం చెప్పలేదు. సీనియర్ మంత్రి తలసానికి ఆ చాన్సిచ్చారు. ఈ సారి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కేసీఆర్ నిజంగా మోదీకి స్వాగతం చెప్పి ఆయనతోపాటు కార్యక్రమంలో పాల్గొంటే మాత్రం రాజకీయంగా సంచలనం అవుతుంది. కేసీఆర్ హాజరు కాకపోతే.. బీజేపీ విమర్శలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే హాజరైతే కేసీఆర్ మళ్లీ బీజేపీతో కలిసిపోయినట్లుగా ఎక్కువ మంది నమ్ముతారు. ఆయన జాతీయ రాజకీయాలు పలుచన అవుతాయి. అందుకే కేసీఆర్ హాజరు కాకపోవడానికే ఎక్కువ చాన్స్ ఉంది.