
Pawan Kalyan On Warangal NIT: జీవితం గమ్యం లేని పోరాటం. బాల్యం, కౌమరం, యవ్వనం, వృద్ధాప్యం.. ఇలా అన్ని దశల్లోనూ పోరాటం ఉంటుంది. వాటిని అధిగమించి సాగడమే జీవితం. ఎన్నో ఆటుపోట్లు, కష్టసుఖాలు ఉంటాయి. వాటిని దాటుకొని వెళ్లడమే గమ్యం. అయితే ఎవరున్న పరిస్థితులకు అనుగుణంగా వారు నడుచుకుంటారు. కొందరు కిందకు పడిపోతారు. పడిలేస్తారు. ఇలా పడిలేచానని చెబుతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. వరంగల్ నిట్ విద్యార్థులతో ముచ్చటించిన పవన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా తనకు ఎదురైన పరిణామాలను విద్యార్థులకు వివరించే ప్రయత్నంచేశారు. ఈ క్రమంలో తాను దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతానని ఒకానొక దశలో డిసైడ్ అయ్యానని.. కానీ చావైనా..బతుకైనా మనదేశంలోనే గడుపుతానని తుది నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు.
గుండె నిబ్బరం అవసరం..
జీవిత గమ్యంలో మనల్ని నిలబెట్టేది గుండెనిబ్బరం మాత్రమేనని పవన్ అన్నారు. మనం సిక్స్ ప్యాక్ చేసి కండలు పెంచుతాం…కానీ అంతకంటే ముఖ్యంగా గుండె బలాన్ని పెంచుకోవాలని విద్యార్థులకు సలహా ఇచ్చారు. ఖుషీ సినిమా తరువాత తాను న్యూజిలాండ్ వెళ్లి సెటిల్ అయిపొవాలని భావించానని.. అక్కడే బతకడానికి డిసైడ్ అయ్యానని.. ఇమ్మిగ్రేషన్ పత్రాలు సైతం సిద్ధం చేసుకున్నానని.. నెలరోజులు నాలో నేను అంతర్మథనం చెందానని.. అయితే చావైనా రేవైనా నా దేశంలోనేనని ఫైనల్ డెసిషన్ కు వచ్చి వెనుకడుగు వేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రతీదానికి ఆలోచన అవసరమన్నారు. నా ఆలోచనలు దేశం కోసం పరితపిస్తున్నందున నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకున్నట్టు చెప్పారు. జీవితంలో ఏది నేర్చుకోవాలంటే అది నేర్చుకోవచ్చు. కానీ ప్రతిదానికి తగినంత సమయం ఇవ్వాల్సిన అవసరముందని పవన్ గుర్తు చేశారు.
కఠోర శ్రమతోనే సక్సెస్..
ఏదైనా రంగంలో విజయాన్ని అందిపుచ్చుకోవాలంటే కచ్చితంగా కృషి అవసరమన్నారు. సమస్య మూలాలకు వెళ్లి శోధించాల్సిన అవసరముందన్నారు. కఠోర శ్రమపడితే కానీ దాని ఫలితం, విజయం దక్కదన్నారు. విజయం దక్కడం ఆలస్యమవుతుందే తప్ప.. ఫలితం కూడా తప్పక లభిస్తుందన్నారు. సామాజిక రుగ్మతలపై భయం లేకుండా ఎలా మాట్లాడాలి? తప్పు జరిగితే ఎలా ఎదుర్కోవాలనే విషయాలపై చాలా రకాలుగా శోధించానని పవన్ చెప్పుకొచ్చారు. కళ్లెదుటే తప్పు జరిగినపుడు వెంటనే స్పందించాల్సిన అవసరముందన్నారు. దానిని బాధ్యతగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ‘తొలిప్రేమ’ సినిమా షూటింగ్ సమయంలో ఒక ఇన్స్ డెంట్ ను పవన్ గుర్తుచేశారు. ఒక బైకర్ ఫోర్ వీలర్ ను ఢీకొట్టి గాయపడ్డాడు. రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ సాహిసించలేదు. అప్పుడే తాను షూటింగ్ షాట్ కి రెడీ అవుతున్నానని..ఆ వ్యక్తిని చూసి చలించిపోయినట్టు చెప్పారు. వెంటనే కారులో ఆస్పత్రికి తీసుకెళ్లానని చెప్పారు. దాని వల్ల షూటింగ్ ఆలస్యమైందే కానీ.. ఆ వ్యక్తి ప్రాణాలు నిలబడడం జీవితంలో మరిచిపోలేనని పవన్ చెప్పుకొచ్చారు.

మనుషులకు, విలువకు ప్రాధాన్యమివ్వాలి…
విజయాల కోసం పాకులాడే సమయంలో కొన్ని సామాజిక రుగ్మతలను చూసీచూడనట్టుగా ముందుకు సాగుతామని… అది కరెక్ట్ కాదని పవన్ అభిప్రాయపడ్డారు. సక్సెస్ లు ఆలస్యమైనా వస్తాయి కానీ.. మనుషుల ప్రాణాలు, విలువుల పోతే తిరిగి తెచ్చుకోలేమన్నారు. అందుకే తాను పరాజయాలను సైతం సక్సెస్ కు గమ్యాలుగా మార్చుకున్నానని చెప్పారు. ఇంటర్ లో సహచర విద్యార్థులంతా స్లిప్పులు రాసి ఉత్తీర్ణత సాధించారని… కానీ నిజాయితీగా పరీక్లలు రాసి ఫెయిలైనట్టు పవన్ గుర్తుచేసుకున్నారు. సినిమా రంగంలో సైతం అదే ఫార్ములాను అనుసరించానని చెప్పారు. నాడు సినిమా షూటింగ్ ఆలస్యమైందన్న చిన్న కారణం తప్పించి… ఒక మనిషి ప్రాణాలను కాపాడిన సంతృప్తి ఇప్పటికీ ఉందన్నారు. రాజకీయ రంగంలో ఫెయిల్యూర్స్ వస్తున్నా పారిపోవడం లేదని.. సక్సెస్ తలుపు తట్టే వరకూ పోరాడుతానని పవన్ స్పష్టం చేశారు. ఇప్పుడు పవన్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.