షర్మిల ముందరికాళ్లకు ‘కేసీఆర్’ బంధం?

రాజన్న రాజ్యం తెస్తానంటూ తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు షర్మిల. ఇప్పటికే ఆయా జిల్లాల వైఎస్సార్‌‌ అభిమానులతో సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించారు. ఇంకా నిర్వహిస్తూనే ఉన్నారు. సమీక్షల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని.. తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ను నిలదీస్తూనే ఉన్నారు. తెలంగాణ వచ్చాక బతుకులేం మారాయంటూ ప్రశ్నిస్తున్నారు. కొత్తగా సాధించింది కూడా ఏంటని అడుగుతున్నారు. ఈనెల 9వ తేదీన ఖమ్మం వేదికగా పార్టీని సైతం ప్రకటించబోతున్నారు. పార్టీ విధివిధానాలు.. పార్టీ జెండా.. ఎజెండాను రూపొందించబోతున్నారు. ఈ క్రమంలో ఆమెపై బీజేపీ […]

Written By: NARESH, Updated On : April 1, 2021 2:46 pm
Follow us on

రాజన్న రాజ్యం తెస్తానంటూ తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు షర్మిల. ఇప్పటికే ఆయా జిల్లాల వైఎస్సార్‌‌ అభిమానులతో సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించారు. ఇంకా నిర్వహిస్తూనే ఉన్నారు. సమీక్షల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని.. తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ను నిలదీస్తూనే ఉన్నారు. తెలంగాణ వచ్చాక బతుకులేం మారాయంటూ ప్రశ్నిస్తున్నారు. కొత్తగా సాధించింది కూడా ఏంటని అడుగుతున్నారు. ఈనెల 9వ తేదీన ఖమ్మం వేదికగా పార్టీని సైతం ప్రకటించబోతున్నారు. పార్టీ విధివిధానాలు.. పార్టీ జెండా.. ఎజెండాను రూపొందించబోతున్నారు. ఈ క్రమంలో ఆమెపై బీజేపీ నాయకులు మరో తీరుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు.

షర్మిల తెలంగాణలో రాజకీయంలోకి రావడం వెనుక వైఎస్‌ జగన్‌, కేసీఆర్‌‌ల హస్తం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. జగన్‌, కేసీఆర్‌‌ కలిసే ఈ కొత్త రాజకీయానికి తెరలేపారని అంటోంది. టీఆర్‌‌ఎస్‌ పార్టీనే అన్నివిధాలా సపోర్టు అందిస్తోందని బీజేపీ నాయకులు ప్రెస్‌మీట్లలోనూ విమర్శిస్తున్నారు. దీనికి కౌంటర్‌‌గా టీఆర్‌‌ఎస్‌ నాయకులు బీజేపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇది తమ పని కాదంటూ చెప్పుకొస్తున్నారు. వీరి లొల్లి ఇలా నడుస్తుంటే.. షర్మిల ఎంటర్ ఇచ్చి.. తాను ఎవరు వదిలిన బాణం కాదని, తెలంగాణలో రాజన్న రాజ్యం తెచ్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానంటూ చెప్పుకొచ్చారు.

అందుకే.. సమావేశాల్లో కేసీఆర్‌‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నట్లుగా తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్‌‌రెడ్డి ఉంటే తెలంగాణ ఇలాంటి గతి వచ్చేది కాదంటూ.. కేసీఆర్‌‌ కంటే వైఎస్సార్‌‌ పాలనే బాగుందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్న షర్మిల.. ఆయా జిల్లాల సమస్యలపైనే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆ జిల్లాకు చెందిన ప్రముఖుల గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

నిన్న లోటస్‌పాండ్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధులతో సమావేశమైన షర్మిల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌‌ సొంత జిల్లాగా చెప్పుకునే మెదక్‌లో 20 కరువు మండలాలు ఉండడం ఏంటని ప్రశ్నించారు. పటాన్చెరు ప్రాంతమంతా కాలుష్య కోరల్లో చిక్కుకుందంటూ విమర్శించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. వారికి ఇంకా న్యాయం జరగలేదని నిలదీశారు. సీఎం జిల్లాలోనే బాధితులు ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. దళితుల భూములు లాక్కుంటున్నారని.. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. అంతేకాదు. మెదక్‌ జిల్లా పాటకు ప్రాణం.. విప్లవానికి ఊపిరిపోసిన గద్దర్‌‌ పుట్టిన గడ్డ అని కొనియాడారు.

ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి మెదక్‌ జిల్లాకు 5.19 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు నాడు వైఎస్‌ రాజశేఖర్‌‌రెడ్డి భావించారని.. కానీ.. నేటి పాలకులు దానిని రీడిజైన్‌ చేసి ఎవరికి మేలు కలిగించారో తెలియడం లేదని విమర్శించారు. మొత్తంగా చూస్తే షర్మిల తన దూకుడును పెంచినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆమె ఇంకా పార్టీ ఏర్పాటు చేయ లేదు కాబట్టి ఆమె విమర్శలను అందరూ లైట్‌ తీసుకుంటున్నారు. టీఆర్‌‌ఎస్‌ నాయకులు సైతం ఆమె విమర్శలపై స్పందించడం లేదు. ప్రారంభంలో తాను రాజకీయాల్లోకి వస్తున్నానని షర్మిల ప్రకటించినప్పుడు కొంత మంది టీఆర్‌‌ఎస్‌ లీడర్లు ఆమెపై విమర్శలు చేశారు. తెలంగాణలో ఆంధ్ర రాజకీయ పార్టీలకు భవిష్యత్‌ ఉండదంటూ ఎద్దేవా చేశారు.ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు షర్మిల పట్ల.. ఆమె పార్టీ పట్ల ఎవరూ పెద్దగా స్పందించడం లేదు.

మరోవైపు.. షర్మిల ఇప్పటివరకు ప్రధాని మోడీ గురించి కానీ, బీజేపీ గురించి కానీ ఎక్కడా విమర్శించలేదు. దీంతో ఇప్పుడు బీజేపీ నేతలు కూడా సైలెంట్‌ అయిపోయారు. ఇక ఖమ్మం సభకు వారం సమయం మాత్రమే ఉంది. లక్షమందితో సభ జరపాలనుకుంటే కరోనా ఆంక్షలు పెట్టి ప్రభుత్వం షర్మిల ప్రయత్నాలపై నీళ్లు చల్లింది. సభ నిర్వహించాలంటే నిబంధనలు పాటించాల్సిందేనంటోంది. ఏప్రిల్ 30 వరకు తెలంగాణలో సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించారు. ఈ ఎఫెక్ట్‌ కాస్త షర్మిల సభ పైనా పడే ప్రమాదం లేకపోలేదు.