Jamili Elections: ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ ఇదీ ప్రధాని మోదీ నినాదం.. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు ఇటీవలే జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో కమిటీ కూడా ఏర్పాటు చేసింది. ఆరు నెలలు ఆగితే దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో 2024 మే నెలలో ఈ ఏడాది డిసెంబర్‌లో జరగాల్సిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు వచ్చే ఏడాది మే నాటికి పూర్తయ్యే రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభ ఎన్నికలు కలిపే నిర్వహించాలన్న ఆలోచనలో మోదీ సర్కార్ ఉంది. ఈమేరకు ఈనెల 18 నుంచి ఐదు రోజులు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెడతారని ప్రచారం జరుగుతోంది. రాజ్యాంగ సరవణ చేస్తారని తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా తెలంగాణ సీఎం ఆశలు గల్లంతయ్యాయి.
మూడు నెలల ముందే అభ్యర్థుల లిస్ట్..
తెలంగాణ అసెంబ్లీకి ఈఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరగాలి. జరుగుతాయన్న ఉద్దేశంతోనే అధికార బీఆర్‌ఎస్, విపక్ష బీజేపీ, కాంగ్రెస్ సన్నద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే.. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉండగానే బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 115 అసెంబ్లీ స్థానాలకు 114 మంది పేర్లు ప్రకటించారు. ఈసారి కేసీఆర్ గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలో పోటీ చేయాలని నిర్ణయించారు. నలుగురు సిట్టింగులకు టికెట్ నిరాకరించారు. అక్టోబర్ 16న వరంగల్‌లో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించి మేనిఫెస్టో కూడా ప్రకటించాలని నిర్ణయించారు. ఈమేరకు మేనిఫెస్టోకు పదును పెట్టే పనిలో ఉన్నారు.
జాతీయ రాజకీయాలు పక్కన పెట్టి..
తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాని భావిస్తున్న కేసీఆర్.. రెండు నెలలుగా జాతీయ రాజకీయాలు పక్కన పెట్టారు. రెండు నెలల ముందు వరకు మహారాష్ట్ర రాజకీయాలపై ఫోకస్‌చేసిన కేసీఆర్ ఇప్పుడు తన దృష్టంతా తెలంగాణపైనే కేంద్రీకరించారు. విపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ను ఎలా దెబ్బకొట్టాలని వ్యూహ రచన చేస్తున్నారు. సంక్షేమ పథకాలతో ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రణాళిక రచిస్తున్నారు.
జమిలి ఎన్నికల ప్రచారంతో..
ఈ క్రమంలో జమిలి ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు, ఈ ఏడాది మేతో గడువు ముగిసే మరో 6 రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్‌సభ ఎన్నికలతో కలిపి ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ ఉత్సాహం ఒక్కసారిగా నీరుగారింది. ఆగస్టు 21న అభ్యర్థులను ప్రకటించి నియోజకవర్గాల్లో ఉండాలని సూచించిన కేసీఆర్.. తాజాగా ప్రచారం ప్రారంభించొద్దని సూచించారు. దీంతో ప్రచారానికి సిద్ధమవుతున్న అభ్యర్థుల్లోనూ టెన్షన్ మొదలైంది.
జమిలికి సిద్ధంగా ఉండాలని..
ఇక కేంద్రం జమిలి ఎన్నికలకు ప్లాన్ చేస్తున్నందున.. జమిలి ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. జమిలి ఎన్నికలు వచ్చినా మనమే గెలుస్తామని ధైర్యం చెబుతున్నారు. కానీ, కేసీఆర్ మాటల్లో ఎక్కడో తేడా కొడుతుందని పార్టీ నేతలే పేర్కొంటున్నారు. అసెంబ్లీ గడువు ముగిస్తే రాష్ట్రపతి పాలన వస్తుంది. దీంతో ప్రభుత్వం పూర్తిగా రద్దవుతుంది. అధికారలన్నీ కేంద్రం చేతులోకి వెళ్తాయి. దీని ప్రభావం వచ్చే ఎన్నికలపై ఉండొచ్చని తెలుస్తోంది. అందుకే కేసీఆర్ టెన్షన్ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మహిళ రిజర్వేషన్ బిల్లుతో టిక్కెట్లు గల్లంతు..
ఇదిలా ఉండగా కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో పెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఈమేరకు ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిరసన కూడా తెలిపారు. అయితే కవిత నిరసన తెలిపిందని కాదు కానీ, ఈనెల 18న ప్రారంభమయ్యే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహళా రిజర్వేషన బిల్లు కూడా పెడతారని తెలుస్తోంది. అదే జరిగితే.. బీఆర్‌ఎస్ ఫస్ట్ లిస్ట్ చెత్త బుట్టలో వేయాల్సిందే. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే కేసీఆర్ మహిళలకు 33 శాతం టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది. దీంతో ఆగస్టు 21 ప్రకటించిన జాబితా మార్చక తప్పదు. అందుకే కేసీఆర్ ప్రచారం చేయొద్దని సూచించినట్లు చర్చ జరుగుతోంది. మొత్తంగా జమిలి ఎన్నికలు కేసీఆర్‌లో టెన్షన్ పెడుతున్నాయన్న చర్చ పార్టీలో జరుగుతోంది.
కేటీఆర్‌లోనూ భయం..
ఇక తెలంగాణ ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారక రామారావులోనూ జమిలి ఎన్నికల భయం కనిపిస్తోంటున్నారు పార్టీ నేతలు. జమిలి ఖాయమని కేటీఆర్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అందుకే ఆయన డిసెంబర్‌లో ఎన్నికలు జరక్క పోవచ్చని వ్యాఖ్యానించారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక జమిలి ఎన్నికలకు వెళ్తే బీఆర్‌ఎస్‌కు భంగపాటు తప్పదని కేటీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ప్రెస్‌మీట్ పెట్టి మరీ జమిలి ఎన్నికల నినాదం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న చీప్ జిమ్మిక్కుగా పేర్కొన్నారు. ప్రజల అటెన్షన్‌ను పక్కదారి పట్టించే కుట్రగా అభివర్ణించారు. త్వరలో ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి ఖాయంగా కనిపిస్తున్నందున ఎన్నికలు ఇప్పట్లో జరగకుండా ఆపే కుట్ర జరుగుతోందని వెల్లడించారు. అయితే బీజేపీ కంటే టెన్షన్ బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శిలోనే ఎక్కువగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడితే.. తమ పరిస్థితి ఎలా ఉంటుందో ముఖ్యమైన మంత్రికి అర్థమవుతోందని సమాచారం. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ను ఆపే శక్తి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సహా ఎవరికీ లేదని కేటీఆర్ వ్యాఖ్యానించడం ఆయనలోని నైరాశ్యానికి నిదర్శనమంటున్నారు.