AP Assembly: ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తారా? అందుకు కేంద్రం సమ్మతిని కోరనున్నారా? అందుకే సీఎం జగన్ ఢిల్లీ బాట పడుతున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. సీఎం ఏ క్షణమైనా ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయని వైసిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో జరిగిన పరిణామాలు వివరించేందుకేనని మరోవైపు వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. అయితే దీనిపై స్పష్టత మాత్రం లేదు.
సీఎం జగన్ లండన్ పర్యటన ముగించుకొని ఏపీకి చేరుకున్నారు. అయితే ఆయన తొలుత నేరుగా ఢిల్లీలో దిగి ప్రధాని మోదీ, అమిత్ షా లను కలవనున్నారని వైసిపి సోషల్ మీడియా విస్తృత ప్రచారం చేసింది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో కేంద్ర పెద్దల సలహా తీసుకున్నట్లు చూపేలా ప్లాన్ చేసినట్లు తెలిసింది. అయితే కేంద్ర పెద్దల నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చాయో తెలియదు గానీ.. జగన్ మాత్రం నేరుగా లండన్ నుంచి ఏపీకి చేరుకున్నారు.అయితే ఇప్పుడు ముందస్తు ఎన్నికల కోసం జగన్ ఢిల్లీ వెళ్లి పెద్దలను కలుస్తారని తెలుస్తోంది.
నిబంధనల ప్రకారం ఈనెల 20 లోపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. ఒక వారం రోజులపాటు అసెంబ్లీని సమావేశపరిచే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లోనే సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గత ఐదేళ్లుగా తాను చేసిన అభివృద్ధి గురించి జగన్ వివరిస్తారని సమాచారం. దీనిని బట్టి ముందస్తుకు వెళ్తారని ప్రచారం ప్రారంభమైంది.
ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. కానీ ఏపీలో అటువంటి జాడలేదు. ఒకవేళ జగన్ అసెంబ్లీని రద్దు చేస్తే ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఇంతలో కేంద్రం జమిలి ఎన్నికలకు కసరత్తు చేస్తుందన్న ప్రచారం ఒకటి ఉంది. అదే జరిగితే పార్లమెంట్ ఎన్నికల తో పాటు జరగాల్సిన ఏపీ అసెంబ్లీకి ముందస్తు ఉండకపోవచ్చు. అందుకు కేంద్రం సైతం ఒప్పుకోకపోవచ్చు. అయితే కేంద్రమే ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేస్తే మాత్రం.. అనుసరించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారు. ఇలా ఎలా చూసుకున్నా జగన్ కేంద్రం అనుమతితోనే ముందడుగు వేయగలరు. అందుకే జగన్ ఢిల్లీ టూర్ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.