సగటు రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాడు? ఎన్నాళ్లకైనా సరే ఓ పదవి ఆశిస్తాడు. అది వారి వారి స్థాయిని బట్టి ఉంటుంది. క్రియాశీల రాజకీయ నాయకుడు ఎప్పుడూ ఉన్నచోటనే ఉండాలని కోరుకోడు. తన లక్ష్యం సాధించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటాడు. అయితే.. తీరా పదవి వస్తుందని భావించిన తర్వాత.. అకస్మాత్తుగా ఎవరో వచ్చి కొట్టుకుపోతే ఎలా ఉంటుంది? ఆ బాధ వర్ణనాతీతం. ఇప్పుడు.. టీఆర్ఎస్, వైసీపీ నేతల్లో పలువురు ఇదే విధమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. పార్టీలో చేరిన పక్షం రోజుల్లోనే ఎమ్మెల్సీని చేసేశారు. ఇది సొంత పార్టీలోనూ సంచలనం రేకెత్తించింది. నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తికి ఏకంగా ఎమ్మెల్సీ పది కేటాయించడం పట్ల హుజూరాబాద్ గులాబీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాహాటంగా ఎవ్వరూ విమర్శించలేదుగానీ.. కేసీఆర్ తీరు ఏ మాత్రం సరికాదని మండిపడుతున్నారట. ఎంతో కాలంగా పార్టీలో ఉన్న తమను కాదని, పార్టీకి సేవ చేసిన తమను విస్మరించి, కౌశిక్ రెడ్డి పదవి కట్టబెట్టడం పట్ల ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.
అచ్చం జగన్ కూడా ఇదేవిధంగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారట వైసీపీ శ్రేణులు, నేతలు! ఈ మధ్యనే తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ పదవి కేటాయించిన సంగతి తెలిసిందే. మొదటి నుంచీ జగన్ వెంట నడిచి, కష్టసుఖాల్లో పాలుపంచుకొని, పార్టీని ముందుకు నడిపించిన వారిని కాదని.. త్రిమూర్తులకు పదవి ఇవ్వడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయట. సామాజిక సమీకరణాలు అనే మాట చెప్పి.. తమకు అన్యాయం చేయడం సరికాదని అంటున్నారు.
ఇప్పటికే చాలా మంది విషయంలో వీరు ఇలాగే వ్యవహరించారనే విమర్శలు ఉండనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనివాళ్లను, ఉద్యమం మీద రాళ్లు వేసినవాళ్లను మంత్రులుగా తెచ్చి పెట్టుకున్నారని ఉద్యమకారులు విమర్శిస్తూనే ఉన్నారు. జగన్ కూడా తొలి నుంచీ పార్టీలో ఉన్నవారికి కాకుండా.. ఇతరులకే ప్రాధాన్యం ఇస్తున్నారనే అపవాదు ఉంది. అయినప్పటికీ.. ప్రస్తుత అవసరాల పేరుతో మొదటి నుంచీ ఉన్నవారిని తొక్కేస్తున్నారని వాపోతున్నారట ఆయా పార్టీల్లోని నేతలు. మరి, దీనికి వాళ్లు ఏం సమాధానం చెబుతారో?