టోక్యో ఒలింపిక్స్ లో మన భారత మహిళా బాక్సర్ కు అదృష్టం కలిసిరాలేదు. మన బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్ ఓడిపోయినా చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ లో కాంస్యం పతకాన్ని భారత్ కు అందించింది. ఒలింపిక్స్ లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్ గా అవతరించింది. ‘మాగ్నిఫిసెంట్ మేరి’ తర్వాత ముద్దాడుతున్న రెండో మహిళగా ఘనకీర్తిని అందుకుంది.
టోక్యో క్రీడల్లో ఆమెకు దక్కింది కాస్యమే అయినా అది స్వర్ణంతో సమానం. ఎందుకంటే భారత బాక్సింగ్ కు 9 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో ఆమె తొలి పతకం అందిస్తోంది.అరంగేట్రం మెగా క్రీడల్లోనూ పోడియంపై నిలబడిన బాక్సర్ గా దేశానికి వన్నె తెచ్చింది.. అంతర్జాతీయ బక్సింగ్ లో అంతగా అనుభవం లేని లవ్లీనాకు సెమీస్ పోరు సులభం కాదని అందరికీ తెలుసు.
ప్రత్యర్థి సుర్మెనెలి (టర్కీ) స్వర్ణ పతకానికి ఫేవరెట్.. ఈ ఏడాది ఆమె రెండు అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణాలు గెలిచి మంచి ఫామ్ లో ఉంది. గతంలో మిడిల్ వెయిట్ (75 కిలోలు) ఆడిన ఆమె ఈసారి 69 కిలోల విభాగంలో తలపడింది. ప్రపంచ చాంపియన్ షిప్స్ లో 16 సార్లు పతకాలు కొల్లగొట్టింది. పిడిగుద్దులు, హుక్స్ , బాడీ షాట్స్ తో విరుచుకుపడే సుర్మెనెలిపై లవ్లీనా స్ఫూర్తిదాయకంగా పోరాడింది.
సెమీస్ లో లవ్లీనా 0-5 తేడాతో ఓటమిపాలైంది. వరుసగా మూడు రౌండ్లలో సుర్మెనెలి న్యాయనిర్ణేతగా ఆకట్టుకుంది. తొలి రౌండ్లో లవ్లీనా కొన్ని పంచులు బాగానే వేసినా ప్రత్యర్థి తన డిఫెన్స్ తో అడ్డుకుంది. ఇక చివరి రౌండ్ లో మరింత తేలిపోయింది.. టర్కీ బాక్సర్ ఘన విజయం అందుకుంది. 2008లో విజేందర్, 2012లో మేరీకోమ్ తర్వాత లవ్లీనా (2021) పతకం అందించడం గమనార్హం.