Chandra Babu-KCR: దేశంలో ఇప్పుడు బీజేపీ హవా నడుస్తోంది. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ ప్రబలమైన శక్తిగా మారింది. ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ వస్తోంది. అటు ప్రాంతీయ పార్టీలను కబళిస్తోంది. కొన్ని పార్టీలను తమ కబంధ హస్తాల్లోకి తెచ్చుకుంది. మాట వినని వారిని అస్థిరపరుస్తోంది. అయితే ఈ పరిణాలు బలమైన ప్రాంతీయ పార్టీల అధినేతలకు కలవరపరుస్తున్నాయి. అందుకే ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీని ఎలాగైనా ఓడించాలని కొందరు ప్రాంతీయ పార్టీల అధినేతలు నిర్ణయించుకున్నారు. అయితే అందరి ధ్యేయం బీజేపీని నిలవరించడమే అయినా.. వారు ఒకేతాటిపైకి మాత్రం రాలేకపోతున్నారు. అందుకు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలే కారణం. అయితే గత ఎన్నికల ముందు నుంచే కూటమి ప్రయోగం చేసిన నేతలు చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు మమతాబెనర్జీ, కేసీఆర్, నితీష్ కుమార్ వంటి వారు కూటమి దిశగా అడుగులేస్తున్నారు. కానీ దానికి ఒక తుది రూపం మాత్రం రావడం లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రత్యర్థి. పశ్చిమబెంగాల్ లో టీఎంసీకి వామపక్షాలు ప్రత్యర్థిగా ఉన్నాయి. అంటుకే కేసీఆర్ కాంగ్రెస్ తో, మమతాబెనర్జీ వామపక్షాలతో కలిసి నడిచేందుకు ఇష్టపడడం లేదు.అయితే కాంగ్రెస్, వామపక్షాలు లేని కూటమి మనుగడపై కూడా అనేక ప్రశ్నలు ఉన్నాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

అయితే కేంద్రంలో మోడీ సర్కారును గద్దె దించాలంటే కాంగ్రెస్, వామపక్షాలతో సహా అన్ని పార్టీలు ఏకంగా కావాలన్న భావన క్రమేపీ పుంజుకుంటోంది. దేవీలాల్ జయంతి సందర్భంగా మహా మెగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో ఉన్న విభేదాలను ప్రాంతీయ పార్టీలు పరిష్కరించుకోవాలని.. అందరూ ఐక్యంగా ముందుకొచ్చి ప్రధాని మోదీపై పోరాటం చేయాలని పిలుపునివ్వడం విశేషం. కాంగ్రెస్, వామపక్షాలు లేని కూటమిని ఊహించుకోలేమని కూడా నితీష్ చెప్పడం పెద్ద విషయమే. అయితే ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయిన తరువాత ఈ వ్యాఖ్యాలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నితీష్ వ్యాఖ్యలతో దేశ వ్యాప్తంగా రాజకీయ సమీకరణలు మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు,
ఫతేహాబాద్ ర్యాలికి దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలకు ఆహ్వానించారు. కానీ చాలా మంది డుమ్మా కొట్టారు. అందులో మమతా బెనర్జీ, కేసీఆర్, చంద్రబాబులు ఉన్నారు. ఒకవేళ కూటమి కట్టి విజయం సాధిస్తే ప్రధానులు అయ్యే జాబితాలో నితీష్ కుమార్; శరద్ పవర్ ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో మమతాబెనర్జీ గైర్హాజరు అయినట్టు టాక్ వినిపిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చంద్రబాబు, కేసీఆర్ లు వెళ్లకపోవడానికి వారికి వేర్వేరు రీతుల్లో వెంటాడుతున్న భయమే కారణమన్న ప్రచారం ఉంది.
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా జరిగే ఎటువంటి కార్యక్రమమైనా హాజరయ్యేందుకు భయపడే స్థితిలో చంద్రబాబు ఉన్నారు. గత ఎన్నికలకు ముందు ఆయన మోదీకి వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారం..దాని పర్యవసానాలు చంద్రబాబుకు తెలుసు. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి వెళ్లాలన్న కృతనిశ్చయంతో చంద్రబాబు ఉన్నారు. ఇప్పటికే జనసేనతో దాదాపు పొత్తు ఫిక్స్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. బీజేపీని కూడా కలుపుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓటుచీలకుండా చూసుకోవాలని చూస్తున్నారు. ఈ సమయంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ర్యాలీకి వెళ్లే చాన్సే లేదు. ఆహ్వాన పత్రిక వచ్చిన నాడే చంద్రబాబు గైర్హాజరవుతారని జాతీయ నేతలు కూడా ఫిక్స్ అయిపోయారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ది మరో సంకట స్థితి. జాతీయ పార్టీ ప్రకటించి కూటమి దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో చెలిమి చేసినా అది జాతీయ స్థాయి వరకేనన్న సంకేతాలను ఇప్పటికే పంపించారు. ఈ నేపథ్యంలో ర్యాలీకి ఆహ్వానం అందినా వెళ్లలేదు. మునుగోడు ఉప ఎన్నికలు ఉండడంతో కాంగ్రెస్ తో కలిసి నడిస్తే బీజేపీకి లాభిస్తుందని.. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని ప్రచారంచేసే అవకాశమున్నందున ఆయన హాజరుకాలేదు. మొత్తానికి మోదీకి వ్యతిరేకంగా చేపడుతున్న కార్యక్రమాలకు తెలుగు నేతలు వెళ్లకపోవడం జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది.