
Khammam Politics: ఒడ్డు దాటాకముందు ఓడ మల్లయ్య, ఒడ్డు దాటాక బోడ మల్లయ్య.. ఈ సామెత ఆ అధికారికి ఇప్పుడు బాగా బోధపడింది. సన్నిహితులతో చెప్పుకొని బాధపడడం తప్ప చేసేది ఏమీ లేక మదన పడటమే మిగిలింది.. ఇందుకు సంబంధించి విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం… ఆ మధ్య లిక్కర్ స్కాంలో కవిత పేరు ప్రస్తావనకు రావడంతో… దర్యాప్తు సంస్థ అధికారులు విచారించేందుకు హైదరాబాద్ వచ్చారు.. దీనిపై మొదట్లో మల్ల గుల్లాలు పడ్డ కవిత… ఆ తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులను విచారణకు రమ్మని కబురు పంపింది.. సుదీర్ఘ విచారణ అనంతరం అధికారులు వెళ్లిపోయారు. కవిత కూడా సైలెంట్ అయిపోయింది.
వాస్తవానికి లిక్కర్ స్కాంలో కవిత పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు అధికార భారత రాష్ట్ర సమితిలో అలజడి చెల రేగింది. ఒకానొక దశలో కేసీఆర్ కవితను మందలించే స్థాయికి వ్యవహారం దిగజారిపోయింది. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు నేరుగా కెసిఆర్ రంగంలోకి దిగాల్సి వచ్చింది.. ప్రగతిభవన్ లోనే మకాం వేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించి కొంతమంది న్యాయ నిపుణులు, దర్యాప్తు సంస్థల్లో పనిచేసిన మాజీ అధికారులను ప్రగతి భవన్ కు పిలిపించుకున్నారు.. ఈ విషయం మీద చాలా సేపు చర్చించారు. అయినప్పటికీ కెసిఆర్ అంతగా సంతృప్తి చెందలేదు.
ఈ దశలో ఖమ్మం జిల్లాలోని ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే కుమారుడు కేంద్ర రెవెన్యూ విభాగంలో కీలక అధికారిగా పనిచేస్తున్నాడు.. ఆయన గురించి తెలుసుకున్న కేసీఆర్ వెంటనే ప్రగతి భవన్ కు పిలిపించుకున్నాడు.. కవిత వ్యవహారాల గురించి చెప్పాడు.. ఆదాయపన్ను శాఖలో కీలక అధికారిగా పనిచేసిన అతను… కవితకు పలు విషయాల్లో తర్ఫీదు ఇచ్చాడు.. అతడు చెప్పిన పలు సూచనలతో కవిత దర్యాప్తు సంస్థల అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.. దీంతో కెసిఆర్ ఊపిరి పీల్చుకున్నాడు. అదే సమయంలో సదరు ఆదాయపనూ శాఖ కమిషనర్ తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని నియోజకవర్గానికి సంబంధించి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు.. దీంతో ఉబ్బితబ్బిబ్బైన ఆ అధికారి కెసిఆర్ కాళ్ళ మీద పడ్డాడు. ఇక అప్పటినుంచి తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నాడు.. పలు కార్యక్రమాలకు హాజరవుతున్నాడు.. వచ్చే ఎన్నికల్లో తానే అధికార పార్టీ అభ్యర్థినని అంతర్గతంగా ప్రకటించుకుంటూ వస్తున్నాడు.. కానీ అదే సమయంలో అతడు ఊహించనిది జరిగింది.
ఈ నియోజకవర్గానికి సంబంధించి కెసిఆర్ ఇంటలిజెన్స్ అధికారులతో ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో సదరు ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కొడుకుకు టికెట్ ఇస్తే గెలిచే పరిస్థితులు లేవని తేలిపోయింది.. దీంతో కెసిఆర్ పునరాలోచనలో పడ్డారు. ఇదే సమయంలో 2018లో అధికార పార్టీ గుర్తు మీద పోటీ చేసి ఓడిపోయిన ఓ మాజీ ఎమ్మెల్యేను కెసిఆర్ ప్రగతి భవన్ కు పిలిపించారు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చి, నియోజవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.. దీంతో ఆదాయపు పన్ను శాఖలో కీలక అధికారి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది.. అప్పుడు మాట ఇచ్చారు కదా అని అడిగితే.. అది అప్పుడు అని…ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని ప్రగతి భవన్ వర్గాలు చెప్పడంతో ఆ ఎమ్మెల్యే కొడుకుకు అసలు సినిమా కనిపించింది.. దీన్ని తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుందని భావించి సదరు అధికారి మిన్నకుంటున్నట్టు తెలుస్తోంది.