Karnataka Elections Basavaraj Bommai: కర్ణాటక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఊహించని ఫలితం వచ్చింది. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. ముఖ్యమంత్రిగా ఎవరిని ప్రకటిస్తారో అధిష్టానం చెప్పకపోయినప్పటికీ.. ప్రస్తుతానికైతే సిద్ధరామయ్య, శివకుమార్ రేసులో ఉన్నారు. ఈ విషయం పక్కన పెడితే భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి బసవరాజ్ క్యాబినెట్లో మంత్రులు ఒక్కొక్కరుగా ఓటమి చవిచూస్తున్నారు. బళ్లారి (ఎస్టి) అసెంబ్లీ నియోజకవర్గంలో శ్రీరాములుపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగేంద్ర గెలుపొందారు. చిక్బల్లాపూర్ లో మంత్రి సుధాకర్ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రదీప్ ఈశ్వర్ విజయం సాధించారు. మరో ఆరుగురు మంత్రులు కూడా వెనుకంజలో ఉన్నారు. ముఖ్యమంత్రి బొమ్మై శిగ్గావ్ స్థానంలో విజయం సాధించారు.
ఇక ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.. 125 స్థానాల్లో ముందంజలో ఉంది. భారతీయ జనతా పార్టీ 70, జెడిఎస్ 23 స్థానాల్లో, ఇతరులు ఆరు నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు.. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టేందుకు సమాయత్తమవుతోంది.. ఇక ఆదివారం బెంగుళూరులో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం నిర్వహించనున్నది. ఈ సందర్భంగా పార్టీ శాసనసభ పక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది.
అవినీతి ఆరోపణలే ప్రధాన కారణం
ఎన్నికలకు ముందు 40 శాతం కమిషన్ ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ పార్టీ బిజెపి నేతలపై విస్తృతంగా ప్రచారం చేసింది.. ముఖ్యమంత్రి ఫోటోను పేటీఎం స్కానర్ పై ఉంచి “పే సీఎం” అనే క్యాంపెయిన్ నడిపించింది. అప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ బిజెపిపై దూకుడు ప్రదర్శించింది. పీసీసీ అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అనేక ఉద్యమాలు నిర్వహించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఓటర్ల మనసు చూరగొనేందుకు ప్రయత్నించింది. చివరికి సఫలికృతమైంది. ఇదే సమయంలో పట్టణ ప్రాంత ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకపోవడం విశేషం. ఇక ఎన్నికలకు ముందు కర్ణాటకలోని లోకాయుక్త దాడుల్లో అధికార బిజెపి ఎమ్మెల్యే భారీగా డబ్బులతో పట్టుబడటం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. దీనిని విశేషంగా ప్రచారానికి వాడుకుంది. కాంట్రాక్టర్లు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగడంతో బిజెపికి ఏం చేయాలో పాలు పోలేని పరిస్థితి ఏర్పడింది. ఇలా అనేక కారణాలు బసవరాజు సర్కార్కు ప్రతిబంధకంగా మారాయి. చివరికి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాయి.