Karnataka Election Results: కర్ణాటకలో మొత్తానికి అనుకున్నట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఎగ్జిట్ ఫలితాల్లో ఈ విషయం తేటతెల్లమైనా.. హంగ్ ఏర్పడుతుందని చాలా మంది భావించారు. అటు బీజేపీ తక్కువ స్థానాల్లో గెలిచినా జేడీఎస్ తో మంతనాలు ప్రారంభించింది. అయితే మధ్యాహ్నం వరకు 120 స్థానాల్లో కాంగ్రెస్ విజయం అవకాశాలు ఉండడంతో సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడిచ్చిన చిక్కల్లా ముఖ్యమంత్రి పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలని అధిష్టానానికి టెన్షన్ మొదలైంది. ఎందుకంటే కర్ణాటక కాంగ్రెస్ గెలుపునకు ఓ వైపు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేసీసీ చీఫ్ డీకే శివకుమార్ లు కలసి తీవ్రంగా కష్టపడ్డారు. అయితే ఎవరికి వారే ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నారు. కానీ కొన్ని విషయాలు పరిశీలిస్తే సిద్ధరామయ్యకే ఎక్కువ అవకాశాలున్నాయని అంటున్నారు.
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వం ఏర్పాటు కావడానికి 113 సీట్లు అవసరం ఉంటుంది. 2018 లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 78, జేడీఎస్ 37 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఆ సమయంలో జేడీఎస్ కీలకంగా మారింది. బీజేపీ ఎంత ప్రయత్నించినా జేడీఎస్ అధినేత కుమార స్వామి కాంగ్రెస్ తో చేసుకున్న ఒప్పందం మేరకు ఆయన ఆ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంటే కొన్నాళ్ల పాటు కుమారస్వామి సీఎంగా ఉండేలా ఒప్పందం చేసుకున్నారు.
అదే 2013 ఎన్నికలను పరిశీలిస్తే ఈ సమయంలో కాంగ్రెస్ పూర్తి మెజారిటీ అంటే 122 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించడంతో కురుబ వర్గానికి చెందిన సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు 2023 ఫలితాలను చూస్తే కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎవరి అవసరం లేకుండా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు కావడానికి మార్గం ఏర్పడిందని అంటున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే అనుభవమున్న సిద్ధరామయ్యకే ఎక్కువ అవకాశాలున్నాయని అంటున్నారు.
ఒకవేళ కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ రాని పక్షంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో డీకే శివకుమార్ కు ఎక్కువగా సపోర్టు చేసేవారని అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ కు మెజారిటీ రాకపోతే జేడీఎస్ తో సంప్రదింపులు జరిపేవారు. ఈ క్రమంలో జేడీఎస్ అధినేత కుమార స్వామి వక్కలిగ వర్గానికి చెందిన డీకే శివమకుమార్ కు సపోర్టు చేసేవారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ కు ఆ పరిస్థితి రావడం లేనందున సిద్ధ రామయ్యకు సీఎం అవకాశం ఇస్తారని అంటున్నారు. డీకే శివకుమార్ కు పార్టీ బాధ్యతలు ఉంటాయని చెబుతున్నారు. మరి డీకే శివకుమార్ ఒప్పుకుంటాడా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.