Kanchanjunga Express Accident: ‘కాంచన్ జంగా’ను ఢీ కొన్న గూడ్స్.. గాలిలో పైకి లేచిన బోగీలు.. 15 మంది మృతి.. 60కి పైగా మందికి గాయాలు..

బెంగాల్ లోని సిలిగురులో సోమవారం (జూన్ 17) రోజున గూడ్స్ రైలు పట్టాలు తప్పి కాంచన్ జంగాను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

Written By: Neelambaram, Updated On : June 17, 2024 2:37 pm

Kanchanjunga Express Accident

Follow us on

Kanchanjunga Express Accident: కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాద ఘటన ఇంకా కండ్ల ముందు మెదులుతూనే ఉంది. అయినా రైల్వే అధికారులు మాత్రం జాగ్రత్తలు తీసుకోవడంలో మీన మేశాలు లెక్కిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోమవారం మరో ట్రైన్ యాక్సిడెంట్ కలవరపట్టింది. ఈ ప్రమాదంలో ఇందులో 15 మంది మరణించగా (వార్త రాసే సమయం వరకు) 60 మందికి పైగా గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లోని రంగపాణి స్టేషన్ సమీపంలో సీల్దా వైపు వెళ్లే కాంచన్ జంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొనడంతో ఈ పెను ప్రమాదం జరిగింది.

బెంగాల్ లోని సిలిగురులో సోమవారం (జూన్ 17) రోజున గూడ్స్ రైలు పట్టాలు తప్పి కాంచన్ జంగాను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. త్రిపురలోని అగర్తలా నుంచి కోల్ కతాలోని సీల్దా స్టేషన్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

భారీ ప్రమాదంలో కాంచన్ జంగాకు చెందిన రెండు కంపార్ట్ మెంట్లు పట్టాలు తప్పగా, ఒక బోగీ గాలిలో వేలాడుతూ కనిపించింది. ఉత్తర బెంగాల్ లోని న్యూ జల్పాయిగురి స్టేషన్ కు 7 కిలో మీటర్ల దూరంలోని సిలిగురిలోని రంగపాణి ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటన బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

‘పశ్చిమ బెంగాల్ లో జరిగిన రైలు ప్రమాదం బాధాకరం. ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సంతాపం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించాను. బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించారు’ అని ఆయన ట్వీట్ చేశారు.

మరణించిన వారి బంధువులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి ₹2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని, గాయపడిన వారికి ₹ 50,000 చెల్లిస్తామని ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది.

కంచన్ జంగా (13174 ) ఎక్స్ ప్రెస్ ఉదయం 9 గంటలకు ప్రమాదానికి గురైందని నార్త్ ఫ్రాంటియర్ రైల్వే కతిహార్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) తెలిపారు. ఎక్స్ ప్రెస్ ను గూడ్స్ రైలు ఢీకొనడంతో ఈ ఘటన జరిగిందని డార్జిలింగ్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ రాయ్ తెలిపారు.

ఈ ప్రమాదంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు, జిల్లా మేజిస్ట్రేట్, వైద్యులు, అబులెన్స్ లను ఘటనా స్థలానికి తరలించినట్లు తెలిపారు.

‘డార్జిలింగ్ జిల్లాలోని ఫన్సిడ్వా ప్రాంతంలో జరిగిన రైలు ప్రమాదంను చూసి దిగ్భ్రాంతికి గురయ్యా. గూడ్స్, కంచన్ జంగా రైలు ఢీకొట్టినట్లు సమాచారం. డీఎం, ఎస్పీ, వైద్యులు, అంబులెన్స్ లు, విపత్తు బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాం’ అని ట్వీట్ చేశారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు.

పశ్చిమబెంగాల్ లోని డార్జిలింగ్ లో జరిగిన రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వార్త చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, సహాయక చర్యలు విజయవంతం కావాలని ప్రార్థిస్తున్నాను’ అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు.