Jagan: హైదరాబాద్ నగరంలోని అక్రమ కట్టడాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు కొన్ని రోజులుగా కొరడా ఝళిపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇల్లు లోటస్‌పాండ్ ముందు ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.
రంగంలోకి ఉన్నతాధికారులు..
జీహెచ్‌ఎంసీ అధికారులు జగన్ ఇంటి ముందు ఉన్న నిర్మాణాలు కూల్చివేయడంపై జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ అమ్రపాలి సీరియస్ అయ్యారు. ఇంటి యజమాని, పొరుగు రాష్ట్రం మాజీ సీఎం అయిన జగన్‌మోహన్‌రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మంత్రి ఆదేశాలతోనే కూల్చివేతలు జరుగుతున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేపై ఇన్‌చార్జి కమిషనర్ చర్యలకు ఉపక్రమించారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జీఐడీకి రిపోర్టు చేయాలని సూచించారు.
ఫిర్యాదులతోనే చర్యలు..
ఇదిలా ఉండగా లోటస్‌పాండ్‌లోని వైఎస్.జగన్ నివాసం ముందు రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదులు అందాయి. ఫుట్‌పాత్‌ను ఆక్రమించి ఇంటి ముందు సెక్యూరిటీ పోస్టుల నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ అధికారుల అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. జేసీబీతో సెక్యూరిటీ పోస్టులను కూల్చివేశారు.
కూల్చివేతకు ఆదేశించిందెవరు..?
ఇదిలా ఉండగా రెండు రాష్ట్రాల్లో కూలివెతపై చర్చ జరుగుతోంది. కూల్చివేతకు ఓ మంత్రి కారణమని ప్రచారం జరుగుతోంది. ఆ మంత్రి తెలంగాణకు చెందిన మంత్రా లేక ఆంధ్రాకు చెందిన మంత్రా అనేది తెలియడం లేదు. పదేళ్లు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడం, మంత్రి ఆక్రమణలు తొలగించారని ఆదేశించడంతో జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టిందని సమాచారం.