Kalyana Laxmi: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో శుభార‍్త చెప్పబోతోంది. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల్లో రూ.లక్ష నగదుతోపాటు తులం బంగారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది. ఈమేరకు పథకంలో మార్పుకు అంచనాలు రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులతో శనివారం సీఎం సమీక్ష నిర్వహించారు.
ప్రస్తుతం రూ.లక్ష నగదు..
2014లో ఏర్పడిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళిత, బీసీ, మైనారిటీ పేద యువతులు పెళ్లికి సాయం అందించేందుకు కల్యాణ లక్ష్మి పథకం ప్రారంభించింది. 2017 మార్పి 13న ప్రారంభించిన ఈ పథకంలో మొదట రూ.51 వేల ఆర్థికసాయం అందించారు. తర్వాత సాయాన్ని రూ.75,116కు పెంచారు. 2018, మార్చి 19న ఆర్థిక సాయాన్ని మరోమారు పెంచి రూ.1,0116 అందిస్తున్నారు. దివ్యాంగ ఆడబిడ్డలకు రూ.1,25,016 అందిస్తున్నారు.
మార్పులతో అందించేలా..
ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఇందులో భాగంగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ సాయం కూడా పెంచుతామని ప్రకటించింది. అధికారంలో రాగానే లబ్ధిదారులకు ఆర్థిక సాయంతోపాటు తులం బంగారం ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈమేరకు హామీ నెరవేర్చేందుకు చర్యలు చేపట్టింది. ఈమేరకు సాయం రూ.1,0116తోపాటు తులం(10 గ్రాముల) బంగారం అందించాలని భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేసేలా చర‍్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు 2024-25 బడ్జెట్‌లో ఈమేరకు నిధులు కేటాయించేలా సీఎం రేవంత్‌రెడ్డి ఆర్థిక శాఖకు సూచనలు చేసినట్లు తెలిసింది.
వీరే అర్హులు..
– 18 ఏళ్లు నిండిన ఎస్సీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ యువతులు ఈ పథకానికి అర్హులు
– గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలు, పట్టణాల్లో వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి.
– ఈమేరకు ధ్రువీకరణ పత్రం దరఖాస్తుతో జత చేయాల్సి ఉంటుంది.