DY Chandrachud: ఈ ఆధునిక కాలంలోనూ వ్యవస్థలు దారితప్పినప్పుడు మనదేశ సర్వోన్నత న్యాయస్థానం కలగజేసుకుంది. నిగ్గదీసి అడిగింది. అగ్గితోని కడిగింది. జీవచ్ఛవంలా మారి ఉన్న సమాజానికి జవసత్వం కలిగించింది. చంద్రచూడ్ ఆధ్వర్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం అనేక సందర్భాల్లో పై ఉదంతాలను నిజం చేసి చూపించింది. అందువల్లే చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా శుక్రవారం తో తన చివరి పని దినాన్ని ముగించుకున్నారు. ఆదివారం పదవి విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన పదవీకాలంలో చోటు చేసుకున్న మార్పులు.. వెలువరించిన తీర్పులపై ప్రత్యేక కథనం..
ఎలక్టోరల్ బాండ్స్
మన దేశ రాజకీయాలలో ఎలక్టోరల్ బాండ్స్ కేసు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకురావడం వివాదంగా మారింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఐదుగురు న్యాయమూర్తుల కాన్స్టిట్యూషనల్ బెంచ్ కేసు హియరింగ్ చేపట్టింది.. “రాజకీయ పార్టీలు.. వ్యాపారవేత్తలు కలిసికట్టుగా చేస్తున్న వ్యవహారం ఇది. ఈ పథకంలో పరస్పర ప్రయోజనాలకు ఇది దారులు పరిచే అవకాశం ఉంది. అందువల్లే దీనిని తక్షణమే నిలిపివేయాలి. ఇప్పటివరకు దీని ద్వారా పొందిన విరాళాలను ప్రచురించాలి. ఈ బాధ్యతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్నికల సంఘం భుజాలకి ఎత్తుకోవాలని” చంద్ర చూడ్ ఆధ్వర్యంలోని బిఆర్ గవాయ్, సంజీవ్ ఖ న్నా, పార్దివాలా, మనోజ్ మిశ్రా తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.. ఈ తీర్పు తర్వాత దేశ రాజకీయాలలో సంచలనం రేకెత్తింది. అంతటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిశ్శబ్దంగా మారాల్సి వచ్చింది. రాజకీయ పార్టీలు తనకు వచ్చిన విరాళాలను ప్రకటించాల్సి వచ్చింది. అందువల్లే దేశంలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో సంచలన తీర్పులు వెలువడ్డాయి. ఇక అప్పటినుంచి రాజకీయ పార్టీల వద్ద ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు విషయంలో వ్యాపార సంస్థలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఒకవేళ సుప్రీంకోర్టు ఆ విషయంలో కలగజేసుకొని పోయి ఉండకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేది. అప్పుడు రాజకీయ పార్టీలు – వ్యాపార సంస్థలు మరింత నిర్లజ్జగా చెట్టా పట్టాలేసుకొని తిరిగేవి.
మాయాజాలం తెలిసిపోయింది
సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే కార్పొరేట్ కంపెనీల మాయాజాలం సామాన్యులకు అర్థమైంది. కాంట్రాక్టుల కోసం ప్రభుత్వాలను అవి ఏ విధంగా ప్రసన్నం చేసుకుంటాయో.. ఏ రూపంలో డబ్బులు ఇస్తాయో.. పార్టీలు వాటిని ఎలాంటి రూపం లో స్వీకరిస్తాయో బయటి ప్రపంచానికి తెలిసింది. దీంతో అప్పటి పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్ మనోగతం పూర్తిగా మారిపోయింది. అందువల్లే విలక్షణమైన తీర్పు సాధ్యమైంది.. అటు బలమైన ప్రతిపక్షం ఏర్పడింది.. ఇటు స్థిరమైన ప్రభుత్వానికి మార్గం ఏర్పడింది. మొత్తంగా చూస్తే ఓటరు గెలవడానికి చంద్ర చూడ్ ఆధ్వర్యంలో ధర్మాసనం ఇచ్చిన తీర్పు భారతీయ న్యాయవ్యవస్థలోనే సరికొత్త చరిత్రను సృష్టించింది.