
Jupally – Ponguleti : “ఆ మధ్య పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన కొప్పుల రాజు, తన బృందంతో వెళ్లాడు.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించాడు. దీనికి పొంగులేటి కూడా ఒప్పుకున్నాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు కొన్ని సీట్లను పొంగులేటికి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయం” ఇదీ నిన్న మొన్నటిదాకా మీడియాలో చక్కర్లు కొట్టిన వార్త. ఇదే సమయంలో” జూపల్లి కృష్ణారావు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఆయనకు డీకే అరుణ ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన కోరిన సీట్లు మొత్తం ఇస్తానని ఆమె ప్రకటించారు. ఇక ఆయన కమలం తీర్థం పుచ్చుకోవడం లాంఛనమే” ఈ వార్త కూడా మీడియాలో నిన్నటి వరకు చక్కర్లు కొట్టింది.
ఈ రెండు వార్తల సారాంశం ఒక్కటే. ఈ ఇద్దరు నేతలు కూడా భారత రాష్ట్ర సమితిలో కీలకమైన నాయకులు. ఆర్థిక బలం మెండుగా ఉన్నవారు. పొంగులేటితో పోల్చితే జూపల్లి కృష్ణారావు ఆర్థిక బలం కొంత తక్కువే అయినప్పటికీ.. జూపల్లి రాజకీయాల్లో పొంగులేటి కంటే చాలా సీనియర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా తొలి దశలో మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి గుర్తు మీద ఎంపీగా పోటీ చేసి తన అభ్యర్థి నామా నాగేశ్వరరావు మీద విజయం సాధించారు. తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.
అయితే 2018 ఎన్నికల్లో కృష్ణారావు ఓడిపోవడం, 2019 ఎన్నికల్లో పొంగులేటికి అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో.. ఇద్దరు నేతలకు కూడా ఎటువంటి పదవి లేకుండా పోయింది. సొంత పార్టీలో ఉక్కపోత ఎక్కువైపోయింది. అధిష్టానం వీరిపై చిన్న చూపు చూస్తూ ఉండడంతో తట్టుకోలేక బయటకు వచ్చేశారు. తమ దారి తాము చూసుకున్నారు. అయితే మరో ఆరు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ ఇద్దరు నేతల్ని ఎలాగైనా తమ పార్టీలోకి చేర్చుకోవాలని అటు భారతీయ జనతా పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ పావులు కదిపాయి. జూపల్లి కృష్ణారావుకు డీకే అరుణ ఫోన్ చేసి భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతుంది. దీనిపై కృష్ణారావు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.మరో వైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసినట్టు ప్రచారం జరిగింది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పొంగులేటి అడిగిన సీట్లను కాంగ్రెస్ పార్టీ ఇచ్చేందుకు సుముఖంగా లేదని ప్రచారం జరుగుతోంది.. మరోవైపు కృష్ణారావు కూడా భారీగా సీట్లు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే వీరిద్దరూ కూడా తమకు కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తోందనే సంకేతాలు భారతీయ జనతా పార్టీకి ఇస్తున్నట్టు తెలుస్తోంది.
వీరిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తాన్ని తనకు అప్పగించాలని కోరుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆయన అశ్వారావుపేట, మధిర, వైరా, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మరి ఇలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ పొంగులేటి ప్రకటించిన అభ్యర్థులకు టికెట్లు ఇస్తే పార్టీ పరిస్థితి ఏంటని ప్రశ్న ఉదయిస్తోంది.. నిన్నగాక మొన్న వచ్చిన అతడికి టికెట్ ఇచ్చుకుంటూ పోతే పార్టీ నే నమ్ముకున్న వారిని ఏం చేస్తారని రేణుక చౌదరి వంటి వారు ప్రశ్నించినట్టు ప్రచారం జరుగుతోంది. మరో వైపు భట్టి విక్రమార్క కూడా పొంగులేటి రాకను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. నేపథ్యంలో అటు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో చేరేందుకు సలహాలు చేసుకుంటున్నారని, తమకు డిమాండ్ ఎక్కువగా ఉందని భారతీయ జనతా పార్టీకి చూపించడం కోసం ఇలాంటి ఎత్తుగడలు రూపొందించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ వారు ఏ పార్టీలో చేరుతారో తెలియదు కానీ.. రోజురోజుకైతే తెరపైకి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి