Jupally Krishna Rao: జూపల్లి టికెట్ల పంచాయితీ.. నాగం ఆగమాగం..

కొల్లాపూర్ తో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలు తన వారికి కేటాయించాలని కొత్తగా వస్తున్న జూపల్లి డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Written By: Bhaskar, Updated On : July 31, 2023 8:24 am

Jupally Krishna Rao

Follow us on

Jupally Krishna Rao: మరి కొద్ది నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల సీజన్ అంటే ఆ పార్టీ నేతలు ఇటు, ఈ పార్టీ నేతలు అటు నిరసనగళం ప్రకటించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రాహుల్ గాంధీ సమక్షంలో శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ.. జూపల్లి కృష్ణారావు ఇంకా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు. ప్రియాంక గాంధీ తో తన నియోజకవర్గంలో సభ నిర్వహించి ఆ వేదికగా కాంగ్రెస్ పార్టీలో చేరాలి అని కృష్ణారావు అనుకుంటున్నారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఆయన తనయుడు రాజేష్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలి అనుకుంటున్నారు. ఇప్పటికే గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఈనెల 30న ప్రియాంక గాంధీ ముఖ్యఅతిథిగా కొల్లాపూర్ ప్రాంతంలో సభ నిర్వహించాలి అనుకున్నారు. అయితే భారీ వర్షాల వల్ల ఈ సభను వాయిదా వేశారు. తదుపరిగా సభ ఎప్పుడు నిర్వహిస్తామో చెబుతామని కృష్ణారావు అంటున్నారు. వాస్తవానికి సభ కోసం ఏర్పాటు చేస్తున్న క్రమంలోనే ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు కాక.. 20వ తేదీ నాటి కొల్లాపూర్ సభ వాయిదా పడింది. అయితే ఈ సభను 30వ తారీఖు నిర్వహించాలి అనుకున్నారు. భారీ వర్షాల వల్ల సభను వాయిదా వేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పార్టీలో చేరకముందే టిక్కెట్ల లొల్లి మొదలైందని తెలుస్తోంది. ఎందుకంటే కొల్లాపూర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు జగదీశ్వర్ రావు, నాగం జనార్దన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే వారు తమ స్వరాన్ని పెంచారు.. జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో కొల్లాపూర్ సీటు ఆయనకే ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగదీశ్వర రావు బల ప్రదర్శన చేశారు. సీనియర్ నాయకుడు మల్లురవి ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన నాగం జనార్దన్ రెడ్డితో కలిసి తన స్వరాన్ని గట్టిగా వినిపించినట్టు తెలుస్తోంది. “గెలిచిన నాయకులు పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశాను. కర్ణాటక ఫలితం తర్వాత పార్టీకి ఊపు వచ్చింది. ఇలాంటప్పుడు ఇతర పార్టీల నాయకులు కేవలం సీట్ల కోసమే చేరుతున్నారు. మరి ఇన్ని రోజులు పని చేసిన మేము ఎటు పోవాలి అంటూ”జగదీశ్వరరావు మల్లురవిని నిలదీసినట్టు తెలుస్తోంది. మరోవైపు జగదీశ్వరరావు కే టికెట్ ఇవ్వాలని కార్యకర్తలు మల్లు రవిని నిలదీసినట్టు ప్రచారం జరుగుతున్నది. సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని మల్లు రవి చెప్పినప్పటికీ కార్యకర్తలు ఒప్పుకోలేదని సమాచారం.

కొల్లాపూర్ తో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలు తన వారికి కేటాయించాలని కొత్తగా వస్తున్న జూపల్లి డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీని గురించి ముందే తెలుసుకున్న నాగం జనార్దన్ రెడ్డి అధిష్టానం మీద ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.”అసలు జూపల్లి చేరడం ఎందుకు? ఆయన మొన్నటిదాకా భారత రాష్ట్ర సమితిలో ఉన్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని మేము కాపాడుకున్నాం. కొల్లాపూర్ లో జగదీశ్వర్ రావు కే టికెట్ ఇవ్వాలి. కార్యకర్తలు ఆయన గెలుపు కోసం పనిచేయాలి. జూపల్లి కృష్ణారావు అనవసరంగా గెలికితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. సర్వేల పేరు చెప్పి జగదీశ్వర రావుకు టికెట్ లేకుండా చేస్తే ఊరుకునేది లేదు” అని పార్టీ అధిష్టానాన్ని జనార్దన్ రెడ్డి హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతున్నది. అసలు సీటు గ్యారెంటీ లేకుండా కృష్ణారావు ఎలా చేరతాడని నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇన్ని పరిణామాల మధ్య కొల్లాపూర్ సీటు జూపల్లి కృష్ణారావుకు కేటాయిస్తే జగదీశ్వరరావు సహకరించడం కష్టమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది పార్టీలో అంతర్గత పోరుకు తరలింపుతుందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక గాంధీ సభ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన నేపథ్యంలో.. అటు జగదీశ్వరరావు, ఇటు నాగం జనార్దన్ రెడ్డి వ్యవహారం జూపల్లి కృష్ణారావుకు తలనొప్పిగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

రేపు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డి కి నాగర్ కర్నూల్ సీటు ఇచ్చారా ఒప్పందం కుదిరినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు నాగం జనార్దన్ రెడ్డి ఈసారి సీటు తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే మరో నాలుగేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ సీటు వదులుకొని దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఆయన తనయుడికి సీటు భరోసా ఇచ్చిన తర్వాతే పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల ముందు అటు పాత ఇటు కొత్త నేతల మధ్య జరుగుతున్న పోరు పార్టీకి నష్టం కలిగిస్తుందని కార్యకర్తలు అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో పార్టీ హై కమాండ్ పాలమూరు సీట్లలో లొల్లిని ఏవిధంగా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.