Homeజాతీయ వార్తలుKCR Vs Congress: కాంగ్రెస్ కు ఝలక్ ఇచ్చే లాగా కేసీఆర్ ప్లాన్

KCR Vs Congress: కాంగ్రెస్ కు ఝలక్ ఇచ్చే లాగా కేసీఆర్ ప్లాన్

KCR Vs Congress: నల్లగొండ.. కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట. ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలు కూడా ఇదే కోవలోకే వస్తాయి. ఈ జిల్లాలోని నేతలు కాంగ్రెస్‌ పార్టీకి సారథ్యం వహించారు. పార్టీ బాధ్యతలు మోశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ పార్టీలో ఈ ప్రాంతం నేతలే కీలకంగా ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికార బీఆర్‌ఎస్‌కు పోటీ ఇస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ఈ జిల్లాల మీద బీఆర్‌ఎస్‌ బాస్‌ కేసీఆర్‌ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నల్లగొండ జిల్లాలోని ఓ కీలక నేతకు గాలం వేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ జిల్లాలోని యాదాద్రికి చెందిన డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. ఇదే దారిలో మరో కీలక నేత ఉన్నట్టు సమాచారం.

ఆయన కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేత. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు నియోజకవర్గాల బాధ్యతలు చూస్తున్నారు. కొద్దికాలంగా రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. తాను పార్టీ మారతానంటూ రాష్ట్ర నాయకత్వం దుష్ప్రచారం చేస్తోందని కూడా చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి ఆఫర్‌ వచ్చిందని, ఆ పార్టీలోకి వెళితే ఎలా ఉంటుందని చర్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోసారి బీఆరెస్సే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన అంచనా వేస్తున్నారని, ఆ పార్టీలో చేరితే తమకు రెండు ఎమ్మెల్యే స్థానాలతోపాటు మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉంటుందని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నేత గులాబీ గూటికి చేరవచ్చన్న అనుమానాలు కాంగ్రెస్‌లో నెలకొన్నాయి.

ఉమ్మడి నల్లగొండ జిల్లాకే చెందిన మరో మరో సీనియర్‌ కాంగ్రెస్‌ నేతకు కూడా బీఆర్‌ఎస్‌ నుంచి ఆఫర్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే స్థానిక పరిస్థితుల దృష్ట్యా తమకు పదవి దక్కే అవకాశాలు లేవన్న ఉద్దేశంతో ఆయన ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు మెదక్‌ జిల్లాకు చెందిన మరో సీనియర్‌ నేతకు కూడా కేసీఆర్‌ గాలం వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే హామీలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం, సుదీర్ఘ పాలన, వైఫల్యాలు తదితర కారణాలతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్ల మెజారిటీ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు ప్రచారంలో ఉంది. కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల్లోని పలువురు అసంతృప్త నేతలు కాంగ్రె్‌సలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఉన్నారు. దీంతో ముందు ముందు ఇది ఎక్కడికి దారి తీస్తుందోనన్న ఆందోళన బీఆర్‌ఎ్‌సలో మెదలైనట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో ప్రభావం చూపగల కాంగ్రెస్‌ నేతలను బీఆర్‌ఎ్‌సలో చేర్చుకునేందుకు సీఎం కేసీఆర్‌ వ్యూహాలు అమలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు.

కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు కేసీఆర్‌ కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఇందుకు క్షేత్రస్థాయిలో సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్‌ పార్టీకి ప్రతినిధులుగా వ్యవహరిస్తూ.. ప్రభావం చూపగల నేతలపై దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో అసంతృప్త నేతలకు తగిన హామీలు ఇచ్చి.. పార్టీలో చేర్చుకోవాలని, వారితోనే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై ఎదురుదాడి చేయించాలని బీఆర్‌ఎస్‌ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఎక్కవ సీట్లు వస్తాయని భావిస్తున్న ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాపై తమ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. భువనగరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్న కేసీఆర్‌.. ఆయనకు ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చారంటేనే కాంగ్రెస్‌ నుంచి చేరికలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు. అయితే అనిల్‌కుమార్‌రెడ్డిని భువనగిరి ఎంపీగా బరిలోకి దించే ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నారన్న చర్చ తాజాగా జరుగుతోంది. కాంగ్రెస్‌ సిటింగ్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈసారి నల్లగొండ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రకటించడంతో.. బీఆర్‌ఎస్‌ తరఫున తాను సులువుగా గెలుస్తానన్న అభిప్రాయంతో అనిల్‌కుమార్‌రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version