Rs 1000 crore rent: మన దేశ ఆర్థిక రాజధానిగా ముంబై నగరం పేరు పొందింది. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఆర్థిక కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మనదేశంలోని ప్రఖ్యాత కార్పొరేట్ సంస్థలు కూడా తమకేంద్ర కార్యాలయాలను ముంబైలో ఏర్పాటు చేశాయి. ఆకాశ హర్మ్యాలు నిర్మించి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ కేంద్రాలలోనే ఆయా కంపెనీలకు సంబంధించిన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే మన దేశానికి సంబంధించిన దిగ్గజ కార్పొరేట్ సంస్థలు మాత్రమే కాకుండా.. ప్రపంచ దేశాలకు చెందిన కార్పొరేట్ సంస్థలు కూడా ముంబైలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. ఇందులో కొన్ని సంస్థలు అద్దె ప్రాతిపదికన తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. ఈ కార్యాలయాల కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అయితే ముంబైలో అద్దెలు భారీగానే ఉంటాయి. గతంలో ఒక కార్పొరేట్ సంస్థ వందల కోట్ల రెంట్ చెల్లిస్తూ కుదుర్చుకున్న ఒప్పందం అప్పట్లో సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ రికార్డును జేపీ మోర్గాన్ అనే కంపెనీ బ్రేక్ చేసింది.
జేపీ మోర్గాన్ అనేది అమెరికా దేశానికి చెందిన దిగ్గజ వ్యాపార సంస్థ. ఇది ముంబైలోని బీకేసి ఏరియాలో తన భారత దేశపు ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతోంది. దీనికోసం సుమిటోమో గ్రూపు డెవలప్ చేస్తున్న కమర్షియల్ టవర్లో ఏకంగా 1,16,210 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని సొంతం చేసుకుంది. ముందుగా పది సంవత్సరాలకు లీజు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఇప్పుడు ఆ లీజు 25 సంవత్సరాల పాటు ఉంటుందని తెలుస్తోంది. ప్రతినెల 6.91 కోట్ల చొప్పున అద్దె చెల్లిస్తుంది. ప్రతి మూడు సంవత్సరాలకు 15% అద్దె పెరుగుతుంది. అంటే 10 సంవత్సరాలకు దాదాపు 1000 కోట్ల అద్దెను జేపీ మోర్గాన్ కంపెనీ సుమిటోమో గ్రూపుకు చెల్లిస్తుంది. సుమిటోమో గ్రూపు ముంబైలో భారీగా కమర్షియల్ బిల్డింగ్ లు నిర్మించింది. ఇప్పుడు బికేసి ఏరియాలో నిర్మించబోయే కమర్షియల్ బిల్డింగ్ లో జేపీ మోర్గాన్ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఆర్థికపరమైన వ్యవహారాలలో జేపీ మోర్గాన్ కంపెనీకి ఎంతో విశిష్టమైన పేరు ఉంది. ఇది అమెరికాలో దిగ్గజ సంస్థగా పేరుపొందింది. ప్రపంచ దేశాలలో ఈ కంపెనీకి కార్యాలయాలు ఉన్నాయి. తొలిసారిగా ఇది భారతదేశంలో ముంబై కేంద్రంగా తన అత్యంత భారీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం సుమిటోమో గ్రూపు నిర్మిస్తున్న కమర్షియల్ బిల్డింగ్ పనులు త్వరలో పూర్తి అవుతాయి. బిల్డింగ్ నిర్మాణం పూర్తయిన తర్వాత జేపీ మోర్గాన్ తన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత తన కార్యకలాపాలను ప్రారంభిస్తుంది.