సీఎం కేసీఆర్‌పై తప్పు వార్త రాశారని ఓ జర్నలిస్ట్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఈ-పేపర్ లో “సీఎం కేసీఆర్‌కు కరోనా” ,”హరితహారం కార్యక్రమంలో సోకిందా” వార్త రెండు రోజుల క్రితం పబ్లిష్ అయింది. దాని పేపర్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై హైదరాబాద్ రహమత్ నగర్ కి చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్త మహ్మద్ ఇలియాస్ ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆదాబ్ హైదరాబాద్ జర్నలిస్ట్ వెంకటేశ్వరరావు, యాజమాన్యంపై ఐపీసీ 505(1)(బి), 505(2) రెడ్ విత్34 సెక్షన్లతో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ సెక్షన్ 54 కింద కేసు నమోదు చేశారు. వెంకటేశ్వరరావు స్వస్థలం ఖమ్మం జిల్లాకు వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేశారు.
ఈ మొత్తం ఉదంతంలో ఆ జర్నలిస్ట్ చేసినా తప్పును ఒక్కసారి పరిశీలిద్దాం..ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కరోనాతో అతకుతలం అవుతుంది. ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. కరోనా విజృంభణ తొలి రోజుల్లో కరోనా భయాన్ని ప్రజలలో పోగొట్టడానికి సీఎం కేసీఆర్ డాక్టర్ వలె ప్రజలకు సలహాలు సూచనలు చేసేవారు. కరోనా, తెలంగాణ గడ్డపై అడుగుపెట్టనే పెట్టదని సాక్షాత్తు సీఎం సారే చెప్పినప్పుడు ప్రజలు సంతోషించారు. పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే కరోనా దరిదాపుల్లోకి రాదని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నప్పుడు కూడా ప్రజలు చాలా ధైర్యంగా బ్రతికారు. గత 10రోజుల నుండి సీఎం సార్ కనిపించకుండా పోయారు. ప్రజాలకు ధైర్యం చెప్పేవారు లేక అల్లడిపోసాగారు. ఇది గమనించిన వెంకటేశ్వరరావు అనే జర్నలిస్ట్ సీఎం సార్ కనిపించడం లేదని ఆయన కరోనా భయంతో బయటకు రాలేకపోతున్నారేమో అని రాశారు. దీనిని కూడా తప్పుగా భావించి ఆయనను అరెస్టు చేయడం ఎంత వరకు సబబు..?