Jansena Chief Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాటల తూటాలను పేల్చుతున్నారు. అధికార పార్టీని టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రధాన మద్యపాన నిషేధం, సినిమా టిక్కెట్ల వివాదాన్ని తెరపైకి తెచ్చి వైసీపీ సర్కారుపై పొలిటికల్ పంచ్ లు వేస్తున్నారు. వరదల్లో కూడా హీట్ పెంచుతున్నారు. గోదావరి జిల్లాల్లో కౌలురైతు భరోసా యాత్ర చేపట్టిన పవన్.. జనవాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కారు కూడా ప్రజాదర్భారు నిర్వహణకు నిర్ణయించింది. అయితే పవన్ మాత్రం వైసీపీతో పాటు జగన్ ను లక్ష్యంగా చేసుకొని హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. రాష్ట్రానికి పట్టిపీడిస్తున్న సమస్యలను ప్రస్తావిస్తున్నారు. అన్నివర్గాల ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. నాడు మేనిఫెస్టోలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడతామని హామీ ఇచ్చారని.. అవన్నీ ఏమయ్యాయని నేరుగా సీఎం జగన్ నే ప్రశ్నిస్తున్నారు. గత కొద్దిరోజులుగా పవన్ చేస్తున్న కామెంట్లపై పోలిటికల్ వర్గాల్లో సైతం చర్చ జరుగుతోంది. అక్టోబరు నుంచి మరింత తీవ్రమయ్యే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే పవన్ యాత్రకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు టీడీపీతో పొత్తు అంశం కూడా క్లారిటీ వచ్చే అవకాశముంది. దీంతో పవన్ విమర్శల జడివానను పెంచే అవకాశముందని భావిస్తున్నారు.
మద్య నిషేధం ఏమైంది?..
ప్రధానంగా పవన్ మద్యపాన నిషేధం హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి ఐదు వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఇంకెంతోమంది ప్రాణాలు పోతాయన్నారు.అందుకే ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అధికారంలోకి రాకూడదన్నారు. అన్నొస్తున్నాడు..మద్యాన్ని నిషేధిస్తానని నాడు చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక మద్యం అమ్ముతున్నాడు.
Also Read: GST Rate Hike: మోడీ సార్ ‘జీఎస్టీ’ బాదుడు.. రేపటి వీటి ధర భారీగా పెంపు
నిషేధించలేదంటూ సైటైర్లు వేశారు. మేనిఫెస్టోలో మద్యపాన నిషేధమన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నారు. మద్యం షాపుల నిర్వహణ తప్పనిసరి అన్నారు. ఏడాదికి 25 శాతం షాపులను తగ్గించి నాలుగేళ్లలో మద్యపాన నిషేధం వైపు అడుగులేస్తానన్నారు. అయితే ఆ అడుగులు కనిపించడం లేదే అంటూ పవన్ ఎద్దేవా చేశారు. నాసిరకం బ్రాండ్లు ఎందుకు అమ్ముతున్నారంటే అందరితో మందు మానిపించేందుకేనని మసిపూసి మారేడు కాయ చేశారు. ధర అంత ఎక్కువ ఎందుకని ప్రశ్నిస్తే వారిని మద్యం నుంచి దూరం చేసేందుకేనని బదులిచ్చారు. ఇప్పుడేమో ఊరూ వాడ మద్యం దుకాణాలు, బార్లు విస్తరిస్తామనడం ఎంతవరకూ సమంజసమని పవన్ ప్రశ్నించారు. ప్రైవేటు మద్యం విధాఃనంతో గత ప్రభుత్వాలు దోచుకున్నాయని చెప్పారని.. తిరిగి అదే విధానం కోసం ఆలోచించడం ఏమిటని ఎద్దేవా చేశారు.
సినిమా టిక్కెట్లపై ఎందుకంత శ్రద్ధ?
అటు సినిమా టిక్కెట్ల విధానంపై ప్రభుత్వం కలగుజేసుకోవడాన్ని పవన్ మరోసారి తప్పుపట్టారు. అసలు సినిమా టిక్కెట్ల వ్యవహారంలో ప్రభుత్వ జోక్యం ఎందుకని ప్రశ్నించారు. సినిమా టిక్కెట్లపై ఉన్న శ్రద్ధ సమస్యలపై లేదన్నారు. సినిమా విడుదలవుతుంటే యంత్రాంగాన్ని మొత్తం మొహరిస్తున్నారని.. ప్రజలు సమస్యలపై సతమతమైనప్పుడు యంత్రాంగాన్ని అలాగే మొహరించవచ్చు కదా అని సలహా ఇచ్చారు. సినిమా పరిశ్రమపై ఎందుకీ కక్ష అన్నారు. తనపై కోపాన్ని సినీ పరిశ్రమపై చూపడం తగదన్నారు. అందుకే వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చే ఛాన్స్ కోల్పోయిందన్నారు. అన్నిరంగాల్లో ప్రభుత్వం వెనుకబడి ఉందన్నారు. మార్పు రావాలంటే వైసీపీ ప్రభుత్వం అంతం కావాల్సిందేనన్నారు. అటు ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తూ.. వారి హక్కులను కాలరాస్తున్న వైసీపీ ప్రభుత్వానికి పాలించే హక్కులేదని హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రాకుండా చూడాలని జనసేన కంకణం కట్టుకుందన్నారు.
Also Read:ENG vs IND 3rd ODI: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్.. ఫైనల్ గెలుపు ఎవరిది?