Bunny Vasu మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. ఇప్పుడు టాలీవుడ్ నిర్మాత అదే చేశాడు. బన్నీ వాసు సేవా తత్పరతకు నిదర్శనమీ ఘటన.. జనసేనలో ఆయన చేరి ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మారి పేదలకు వరదల్లో సాయం చేసేందుకు స్వయంగా వెళ్లడం ఎంతో ధైర్యంగా చెప్పొచ్చు. ఆయన ధైర్యానికి ఈ ఘటన మచ్చు తునక. పడవ ప్రమాదం జరిగినా బన్నీ వాసు పలువురిని ఆదుకోవడం చూసి అందరూ శభాష్ అంటూ ప్రశంసలు కురుస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో నిర్మాత బన్నీ వాసుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి నది పొంగి పొర్లుతోంది. పలు గ్రామాలు నీట మునిగాయి. బన్నీ వాసు తన వంతు కర్తవ్యంగా వరద లో చిక్కుకున్న వారిని ముఖ్యం గా ఒక గర్భిణీ ని రక్షించే సమయం లో పడవ ప్రమాదానికి గురైంది.
బాడవ గ్రామంలో వరదలో చిక్కుకున్న వారిని పడవలో ఏనుగువారి లంక తీసుకు వస్తుండగా వరద ఉధృతి పెరిగింది. దీంతో పడవ నీటిలో కొట్టుకోపోసాగింది. ఆ క్రమంలో పడవ కొబ్బరి చెట్టుకు తగిలి ఆగింది. దీంతో పడవలోని వారంతా కంగారు పడటంతో పడవ విరిగి పోయింది. వెంటనే పడవ నడిపే వ్యక్తులు పడవలోని వారిని రక్షించారు.
ప్రమాదం తప్పటంతో గర్భిణీ , బన్నీవాసు, జనసేన నాయకులు , పడవలోని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టం బాగుండి ప్రమాదం తప్పిందని బన్నీ వాసు అన్నారు. ప్రమాదం అంచున లంక గ్రామాల ప్రజలు ఉన్నారని…. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
బన్నీ వాసు నిర్మాతగా టాలీవుడ్ లో పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యాన్ అనుబంధ సంస్థ గీతాఆర్ట్స్ 2కు నిర్మాతగా వ్యవహరిస్తూ కొత్త టాలెంట్ ను, కొత్త కాన్సెప్ట్, కంటెంట్ ప్రధాన సినిమాలను నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాన్ పై అభిమానంతో జనసేనలో చేరి ప్రజాసేవ చేస్తున్నారు.