Nadendla Manohar : ప్రభుత్వంలో ఉన్నవారు చెప్పే మాటలు, హామీలు అమలు చేయకుండా మోసం చేసినప్పుడు ధైర్యంగా ప్రశ్నించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. త్యాగధనుల స్ఫూర్తితో, రాజ్యాంగ స్ఫూర్తిని ని నిలబెట్టేలా జనసేన శ్రేణులు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ప్రతి అడుగు రాష్ట్ర భవిష్యత్తు కోసమే వేస్తుందని, పవన్ కళ్యాణ్ ప్రతి మాట యువత భవిష్యత్తు కోసమే మాట్లాడుతారని అన్నారు. చట్టాలను గౌరవిస్తూ, వ్యవస్థల్ని కాపాడుతూ ముందుకు వెళ్తామన్నారు.మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయానికి విచ్చేసిన పార్టీ శ్రేణులను ఉద్దేశించి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “మహనీయుల త్యాగాల విలువలను మనమంతా నిలబెట్టాలి. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా పని చేయాలి. 2014లో జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఛైతన్యం తీసుకువచ్చే విధంగా పని చేస్తున్నారు. బాధ్యతగల పౌరులుగా మనం దేని కోసం పోరాడాలి అనే అంశాల మీద దిశానిర్ధేశం చేస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారు. అదే స్ఫూర్తితో నిబద్దత కలిగిన వ్యక్తులుగా పట్టుదలతో మనమంతా విజయం కోసం పని చేయాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని క్షేత్ర స్థాయిలో మనమంతా ముందుకు తీసుకువెళ్లాలి. ప్రతి ఒక్కరు ఎదగాలి అన్న ఆలోచనతో ఆయన చేసిన ప్రస్థానం ఇచ్చిన స్ఫూర్తితో పార్టీని ముందుకు తీసుకువెళ్దాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమం చేపట్టినా అది సమాజహితం కోసమే చేస్తారు. పార్టీగా ఏ కార్యక్రమం చేసినా సమాజానికి, రాష్ట్ర్ర భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగానే చేస్తాం. కేవలం ఓట్ల కోసం జనసేన పార్టీ రాజకీయాలు చేయదు.
• నిత్యం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్
బుధవారం సబ్ ప్లాన్ అమలు తీరుపైన సదస్సు ఏర్పాటు చేశాం. ప్రతి మానవుడికి సమాన అవకాశాలు అందే విధంగా గతంలో చట్టాలు తీసుకువస్తే.. గడచిన ఐదేళ్ల నుంచి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఆ అంశాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే సదస్సు నిర్వహించి బలమైన సందేశాన్ని ఇవ్వగలిగాం. నాయకత్వం అంటే కేవలం ఉపన్యాసాలు, పత్రిక ప్రకటనలకు పరిమితం కావడం కాదు. ప్రతి అడుగు రాష్ట్ర భవిష్యత్తు కోసమే వేయాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి అడుగు మన భవిష్యత్తు కోసమే వేస్తారు. కేంద్ర నాయకత్వాన్ని కలసిన ఏ సందర్భంలో ఆయన వ్యక్తిగత లబ్ది కోసం మాట్లాడింది లేదు. ప్రతి సారి మన రాష్ట్ర కోసం, యువత భవిష్యత్తు కోసమే మాట్లాడారు.
జనసేన పార్టీ ఎవరు ఎలాంటి ఆపదలో ఉన్నా అండగా నిలబడే పార్టీ. ఎన్నికల తర్వాత భవన నిర్మాణ కార్మికుల కోసం అద్భుతమైన పోరాటం చేశాం. ఇసుక కొరత, యువత ఉపాధి, జాబ్ క్యాలెండర్, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ తదితర అంశాల మీద పోరాడాం. జనవాణి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా అండగా నిలబడి భరోసా ఇస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా ప్రజలకు అండగా నిలబడే విధంగా ముందుకు వెళ్తున్నాం. పార్టీ కోసం అహర్నిసలు కష్టపడే వారిని గుర్తించి పార్టీ నిర్మాణం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దేశంలో ఏ పార్టీ చేయని విధంగా క్రియాశీలక సభ్యత్వం ఏర్పాటు చేసుకున్నాం. 3 లక్షల 60 వేల మంది సభ్యులుగా చేరారు. రాబోయే రోజుల్లో ఇప్పటికే సభ్యత్వం ఉన్న వారికి రెన్యువల్ చేసే కార్యక్రమంతో పాటు కొత్తగా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలనుకునే వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం.
• అధికార దుర్వినియోగాన్ని జనసేన సహించదు
జనసేన పార్టీ కార్యకర్తలుగా మనం దేశానికి ఏ విధంగా ఉపయోగపడతాం.. రాజకీయాల్లో ఎలాంటి మార్పు తీసుకురాగలం అనే అంశాలపై ఆలోచించండి. ప్రతి ఒక్కరు ధైర్యంగా నిలబడండి. సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాలో, నియోజకవర్గంలో కార్యకర్తలకు ఇబ్బందులు కలగకుండా పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారు న్యాయవాదుల్ని ఏర్పాటు చేశారు. చిన్న చిన్న అంశాలపై కూడా కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాజ్యాంగం ఉన్నది దాని కోసం కాదు. మన ప్రతి చర్య మన ప్రాంతానికి మేలు చేయాలి. ప్రతి పేద వాడిని ఉన్నత స్థాయికి తీసుకువచ్చే విధంగా ఉండాలి గాని అధికార దుర్వినియోగానికి పాల్పడి కేసులు పెడితే జనసేన సహించదు. అన్యాయంగా ఎవరి మీద కేసులు పెట్టినా జనసేన అండగా ఉంటుంది. అవసరం అయితే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీ కోసం వస్తారు. ధైర్యంగా ఉండండి. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే ఉంది. ఈ ఏడాది కాలం కావాలనే ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తారు. వారాహి వాహనం గురించి దుర్మార్గంగా చేసిన ప్రకటనల్ని అమ్మవారి ఆశీస్సులతో అద్భుతంగా తిప్పికొట్టగలిగాం. మన బలం చూసుకుని మనం మాట్లాడితే ఎవరు ఆపగలరు. ఆ ధైర్యం ఎవరికి ఉంది. మనం ఎప్పుడూ చట్టాలను, వ్యక్తుల్ని గౌరవిస్తాం. తద్వారా వ్యవస్థల్ని కాపాడుతాం. గణతంత్ర దినోత్సవం మనందరిలో మంచి స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపాలి. పార్టీ కోసం అంతా క్షేత్ర స్థాయిలో కష్టపడి పని చేయండి. భవిష్యత్తులో అద్భుత విజయాలు సాధిస్తాం” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు.
* జనసేనలోకి విశాఖ వైసీపీ కార్పొరేటర్
విశాఖపట్నం నగర పాలక సంస్థ వైసీపీ కార్పొరేటర్ శ్రీ కందుల నాగరాజు. జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన కండువా వేసి శ్రీ కందుల నాగరాజుని పార్టీలోకి ఆహ్వానించారు. విశాఖపట్నం నగర, జిల్లా పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Janasena will carry forward the spirit of freedom fighters
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com