Taraka Ratna- Vijayasai Reddy: వైసీపీ-టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ పార్టీ కీలక వ్యక్తుల్లో ఒకరు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లను తీవ్ర పదజాలంతో విజయసాయిరెడ్డి విమర్శిస్తూ ఉంటారు. టీడీపీ లీడర్స్ ప్రధాన టార్గెట్ విజయసాయిరెడ్డి. అలాంటి విజయసాయిరెడ్డి నందమూరి వంశానికి బంధువు అన్న విషయం చాలా మందికి తెలియదు. తారకరత్నకు విజయసాయిరెడ్డి స్వయానా మామ అవుతారు. తారకరత్న 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు నందీశ్వరుడు చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా అలేఖ్య రెడ్డి పని చేశారు. ఆ సమయంలో అలేఖ్య-తారకరత్న మధ్య ప్రేమ చిగురించింది.

అలేఖ్యతో వివాహానికి తారకరత్న పేరెంట్స్ ఒప్పుకోలేదట. దీంతో ఆయన గుడిలో మిత్రుల మధ్య నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొన్నాళ్ల తర్వాత పేరెంట్స్ తారకరత్న-అలేఖ్యలను దగ్గరకు తీసుకున్నారు. తారకరత్న భార్య అలేఖ్యకు విజయసాయిరెడ్డి పెదనాన్న వరస అవుతారు. విజయసాయిరెడ్డి భార్య సునంద చెల్లెలు కూతురే అలేఖ్య. కాబట్టి విజయసాయిరెడ్డి భార్య అలేఖ్యకు సొంత పెద్దమ్మ అవుతుంది.
ఆ విధంగా విజయసాయిరెడ్డి నందమూరి వారి బంధువు అయ్యాడు. తారకరత్నకు మామయ్య అయ్యాడు. రాజకీయంగా ఎన్ని ఉన్నా బంధుత్వం పరంగా తారకరత్న, విజయసాయిరెడ్డి బాగానే ఉంటారట. విజయసాయిరెడ్డి కరుడుగట్టిన వైసీపీ లీడర్ కాగా… తారకరత్న పక్కా టీడీపీ. అనుకోకుండా ప్రేమ వివాహంతో ఇద్దరి మధ్య బంధుత్వం ఏర్పడింది. అలేఖ్య రెడ్డి-తారకరత్నలకు ఒక అమ్మాయి సంతానం. వీరు అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు.

గుండెపోటుకు గురైన తారకరత్నకు బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది. ఆయన పరిస్థితి మరింత విషమంగా మారినట్లు వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తారకరత్న తిరిగి కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. జనవరి 27న కుప్పం వేదికగా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. లోకేష్ పాదయాత్రకు మద్దతుగా పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. బాలకృష్ణతో పాటు తారకరత్న యువగళం కార్యక్రమంలో భాగమయ్యారు. కార్యకర్తల మధ్య నడుస్తూ తారకరత్న గుండెపోటు కారణంగా కుప్పకూలిపోయారు. వెంటనే కార్యకర్తలు స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గత రాత్రి ప్రత్యేకమైన అంబులెన్స్ లో బెంగుళూరు తీసుకెళ్లి నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. వైద్య బృందం ఆయన్ని పర్యవేక్షిస్తున్నారు.