Jagan: ఏపీ సీఎం జగన్ ఇటీవల జనసేన పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ ను టార్గెట్ చేసుకుంటూ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో తన బర్రెలక్క కు వచ్చిన ఓట్లు కూడా రాలేదని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో సినిమా డైలాగులు చెప్పి.. ఏపీ ఎన్నికల్లో గెలుపొందుతానని చెబుతున్న పవన్ ఏ ముఖం పెట్టుకుంటారు అంటూ జగన్ వ్యక్తిగత కామెంట్లు చేశారు. జనసేన విషయంలో ఎగతాళిగా మాట్లాడారు.ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైసీపీ వైరల్ చేస్తోంది. అయితే దీనికి జనసేన శ్రేణులు ధీటుగా స్పందిస్తున్నాయి.
పవన్ ను టార్గెట్ చేసుకుంటూ జగన్ మాట్లాడడం ఇదే తొలిసారి కాదు. జిల్లాల పర్యటనకు వెళ్తున్న ప్రతిసారి పవన్ పై వ్యక్తిగత కామెంట్లకు దిగుతూ వచ్చారు. వైవాహిక జీవితంతో పాటు జనసేన పార్టీపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయనకు హైదరాబాదులో ఇల్లు ఉంటుంది కానీ.. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇల్లాలు మారుతుంది అంటూ ఆ మధ్యన వ్యాఖ్యలు చేశారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సైతం తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఫలితాలను ప్రస్తావించి మరి విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా బర్రెలక్క ప్రస్తావన తీసుకురావడాన్ని.. ఆమెతో పవన్ ను పోల్చడాన్ని జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
దీనిపై జనసైనికులు సోషల్ మీడియాలో ఫైట్ చేస్తున్నారు. 2014 తెలంగాణ ఎన్నికల్లో వైసిపికి నోటా కంటే తక్కువ ఓట్లు రావడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏయే నియోజకవర్గాల్లో ఎన్ని ఓట్లు వచ్చాయో వివరాలతో సహా వెల్లడిస్తున్నారు. ఎన్నికల అన్నాక గెలుపోటములు సహజమని.. గెలుపునే రాజకీయం అనుకుంటున్న వైసిపి కి వచ్చిన ఓట్లు ఇవేనంటూ చేస్తున్న ప్రచారానికి విశేష స్పందన వస్తోంది. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చేసరికి వైసీపీ శ్రేణుల నుంచి నోటి మాట రావడం లేదు. దీంతో జనసైనికులు కూడా అదే దూకుడుతో వ్యవహరిస్తూ ఉన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో బిజెపితో పొత్తులో భాగంగా జనసేన ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎక్కడ కూడా జనసేనకు డిపాజిట్లు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ గా బరిలో దిగిన బర్రెల అక్కకు 5000 ఓట్లు వచ్చాయి. అప్పటినుంచి వైసిపి నేతలు జనసేన ను టార్గెట్ చేశారు. ఏపీలో బిజెపి, జనసేన కలవకుండా కొత్త ప్రచారానికి తెర తీశారు. బర్రెలక్కన ప్రస్తావిస్తూ జనసేన ను టార్గెట్ చేయడం ప్రారంభించారు. ఏకంగా సీఎం జగన్ సైతం అదే తరహా విమర్శలు చేశారు. దీంతో జనసేన శ్రేణులు 2014 ఎన్నికలను ప్రస్తావిస్తూ దీటైన కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు. దీనిపై వైసీపీ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం విశేషం.