Guntur: పెద్ద అయితే తాను పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతానని ఆ బాలుడు చెబుతుండేవాడు. దొంగలను పట్టుకుని జైల్లో వేస్తానంటూ చెప్పుకొచ్చేవాడు. ఆ బాలుడి మాటలను విని తల్లిదండ్రులు పొంగిపోయేవారు. తమ కుమారుడు ఆ స్థాయికి రాణించగలడని నమ్మకంగా చెబుతుండేవారు. అయితే ఆ తల్లిదండ్రులను చూసి విధి ఈర్ష్య పడిందేమో.. క్యాన్సర్ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. కబళించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ చిన్నారికి ఆ విషయం తెలియదు. కానీ ఆ చిన్నారి ఆశను తీర్చి పెద్ద పోలీస్ ఆఫీసర్ చేశారు.
గుంటూరు నగరానికి చెందిన అనుపోజు బ్రహ్మం, లక్ష్మీ దంపతులకు మోహన్ సాయి అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. 4వ తరగతి చదువుతున్న సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్య పరీక్షల అనంతరం చిన్నారికి రెక్టం కేన్సర్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఏడాదికాలంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు.
అయితే పోలీస్ అధికారి కావాలన్నా మోహన్ సాయి కోరికను తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది, మేక్ ఏ విష్ ఫౌండేషన్ సభ్యుల ద్వారా చిన్నారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి చిన్నారి కోరిక గురించి తెలియజేశారు. మానవతా దృక్పథంతో ఆలోచించిన అక్కడి ఇన్ స్పెక్టర్ జాకీర్ హుస్సేన్ సహకరించారు. ఆ చిన్నారిని సాదరంగా ఆహ్వానించి పోలీస్ అధికారి సీట్లో కూర్చోబెట్టారు. చిన్ననాటి నుంచి తాను కలలుగంటున్న కోరికను తీర్చే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా ఆ చిన్నారికి గౌరవ వందనం చేసి.. చిన్నారి నుంచి కూడా గౌరవం వందనం స్వీకరించారు. పోలీస్ స్టేషన్లో జరిగే పని విధానం గురించి వివరించారు. బహుమతులు అందజేశారు.
అయితే తనకు ప్రమాదం పొంచి ఉందని తెలియని ఆ చిన్నారి ముఖంలో వికసించిన చిరునవ్వులు చూసి పోలీస్ అధికారులు, సిబ్బంది బాధపడ్డారు. కొంతమంది కన్నీటి పర్యంతమయ్యారు. మోహన్ సాయి త్వరగా కోలుకొని.. పెద్దయ్యాక పోలీసు ఉన్నతాధికారి కొలువు దక్కించుకోవాలని ఎక్కువమంది ఆకాంక్షించారు. ఆశీస్సులు తెలిపారు.