Revanth Reddy vs Jagga Reddy: కాంగ్రెస్ లో కుమ్ములాటలు కొత్తేమీ కాదు. గ్రూపు రాజకీయాలకు గూడుపుఠాణీలకు పెట్టింది పేరు. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో గొడవలు పెట్టుకోవడం వారికి అలవాటే. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక సీనియర్లలో ఆగ్రహాలు పెరిగాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అందలాలు ఎక్కిస్తూ పార్టీని పట్టుకుని వేలాడుతున్న మాలాంటి వారిని ఎందుకు పక్కన పెట్టారంటే అప్పటినుంచే సపరేట్ వింగ్ ఏర్పాటైంది. ఇందులో భాగంగానే కొందరు బహిరంగంగా విమర్శలు చేసినా మరికొందరు చాటుమాటుగా వ్యవహారాలు నడిపిస్తూ పార్టీకి సహకరించకుండా ఉంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
ఏది చేద్దామన్నా సహకారం అందించకుండా దాన్ని విమర్శనాత్మకంగా మలుచుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో పార్టీకి జవసత్వాలు లేకుండా అచేతన స్థితిలో ఉండిపోయింది. ఈ నేపథ్యంలో పార్టీ టీపీసీసీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇంకా ఉపేక్షిస్తే పార్టీ నామరూపాల్లేకుండా పోయే ప్రమాదం ఉందని గ్రహించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై చర్యలకు నిర్ణయం తీసుకుంది. ఆయనను కార్యనిర్వహణ అధ్యక్ష పదవి, ఇతర బాధ్యతల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీపై కేసీఆర్ సంచలన కామెంట్స్.. అప్పుడు అధికారంలో ఉన్నదెవరంటూ..
దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ పెద్దలను కలిసి పరిస్థితిని వివరించనున్నారు. పార్టీపై ప్రజల్లో పట్టుకోల్పోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ చర్యలతోనైనా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. దీని కోసం రేవంత్ రెడ్డి పెద్దల మద్దతుతో రాష్ట్రంలో పార్టీని పూర్వవైభవంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయనకు సహకరించే వారు లేకపోవడం గమనార్హం. ఏ కార్యక్రమం తీసుకున్నా దానికి అడ్డు తగలడమే కానీ ముందుకు తీసుకెళ్లే నాయకుడు కనిపించడం లేదు. దీంతో రేవంత్ రెడ్డిలో సైతం నైరాశ్యం కనిపిస్తోంది.
సీనియర్లందరు పార్టీకి సేవలందించాల్సింది పోయి పార్టీని అధోగతి పాలు చేసేందుకే కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకే వారు ప్రతి కార్యక్రమాన్ని ఫెయిల్ చేయడానికే ముందుకు రావడం గమనార్హం. దీంతో పార్టీ నేతల్లో కూడా జోష్ తగ్గుతోంది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేసే నాయకులు కావాలే కానీ ఇలా అడ్డుతగిలే వారుంటే పార్టీ ఎలా బతుకుంది. ప్రస్తుతం జగ్గారెడ్డి ఎలా స్పందిస్తారో అనే దాని మీదే పార్టీ దృష్టి సారించింది. కొద్ది రోజులుగా ఆయన పార్టీ మారతారని, సొంత పార్టీ పెడతారనే వాదనలు బలంగా వినిస్తున్న సందర్భంలో ఆయన ఏం చెబుతారనే దాని మీదే నేతలు దృష్టి సారించారు.
ఇప్పటికైనా పార్టీ చర్యలకు ముందుకు రావడంతో సీనియర్లకు హెచ్చరికలు పంపినట్లు అయింది. ఎవరైనా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పని చేయాలని చెప్పకనే చెప్పింది. నేతల్లో ఇప్పటికైనా మార్పు వస్తుందా? లేక మునుపటి తీరే వ్యవహరించి క్రమశిక్షణ చర్యలకు బాధ్యులవుతారో తెలియడం లేదు. మొత్తానికి రేవంత్ రెడ్డి ఈ విషయంలో కొంతవరకు సక్సెస్ సాధించినట్లే. ఇన్నాళ్లు సీనియర్ల చేతుల్లో నరకయాతన అనుభవించిన ఆయనకు ఇకనైనా విముక్తి లభిస్తుందో వేచి చూడాల్సిందే.
Also Read: కాంగ్రెస్ కథ: బలోపేతం మాటున బలహీనపర్చే ప్రయత్నం..
Recommended Video: