జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన కొత్తల్లో నవరత్నాల అమలు చేసే పద్ధతి చూసి సామాన్య ప్రజలంతా… ఆహా ఓహో అని అతనిని కీర్తించడం మొదలుపెట్టారు. సంవత్సరం తర్వాత కూడా తను సక్సెస్ ఫుల్ గా ఆ పథకాలను అమలు చేస్తుంటే భళా “ముఖ్యమంత్రి వర్యా..!” అన్నారు. ఇదంతా కేవలం వైసిపి మద్దతుదారులు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల మాట అయితే అటు విశ్లేషకులు చెబుతున్నది ఏమిటంటే సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్ర ఖజానా అధికారికంగా లూటీ అయిపోతుందట. ఇంకా గట్టిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు కి జగన్ ఏ మాత్రం తీసిపోని రీతిలో ఖజానాని లూటీ చేస్తుండడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే…. వైసిపి అనుకూల మీడియా టీడీపీ అధినేత నారా చంద్రబాబు పై ఒక కథనాన్ని ప్రచురించింది. ‘తనఖా రుణం తన ప్రచారానికి’ అన్నది దాని హెడ్డింగ్. సరిగ్గా ఎన్నికల సమయంలో చంద్రబాబు ‘పసుపు కుంకుమ’ పథకాన్ని ప్రచారం కోసం ప్రకటించారని దాని సారాంశం. దీనికోసం రహదారులు పేరుతో మూడు వేల కోట్లు అప్పు చేశారు అని చెప్పారు. అంతా బాగుంది. ఇందులో సగం మనందరికీ తెలిసిన నిజం మిగతా సగం తెలియాల్సి ఉంది. అయితే అది ప్రభుత్వ నిర్ణయం.
ఇప్పుడు వైయస్ జగన్ హయాంలో కూడా వేరుగా ఏమీ జరగట్లేదు. సంక్షేమ పథకాలు అమలు కోసం జగన్ ప్రభుత్వం నిధుల సమీకరణ ఎలా పడుతుందో చూస్తూనే ఉన్నాం. భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తుంది…. ఇంకా ఆదాయం కోసం ఏవేవో ప్రయత్నిస్తుంది. అది కాకుండా క్రమం తప్పకుండా కొత్త అప్పులు చేస్తూనే ఉన్నారు. ‘పాలన’ అంటే సంక్షేమ పథకాలే అనే ఉద్ధేశానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసింది. ఈ సంక్షేమ పథకాలు జగన్ పేరు మీద వైఎస్ఆర్ పేరు మీద కేవలంవారి పార్టీ ప్రచారానికి ఉపయోగపడుతున్నాయే తప్ప దీని వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏమీ లేవు అన్నది ఆర్థికవేత్తల మాట.
సరే అభివృద్ధి చేసి తద్వారా వచ్చే ఫలాలని ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో జగన్ అందిస్తే దానికి అందరూ సంతోషిస్తారు. అదే అసలు ‘పాలన’ అంటే. అయితే ఇక్కడ జరుగుతున్నది మాత్రం కేవలం పబ్లిసిటీ స్టంట్. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఇంకోపక్క ఆదాయం పెంచుకోవడానికి పన్నులు పెంచేస్తున్నారు. ప్రతి నెలా వేలాది కోట్లు డబ్బులు అప్పు తెస్తున్నారు. అది చివరకి ఎవరు కడతారు..? మంత్రులా.. లేక ముఖ్యమంత్రులా? ప్రజలే కదా చివరికి వాటిని కట్టాల్సింది.
ఏదిఏమైనా అప్పుడు చంద్రబాబు చేసింది తప్పు అయితే ఇప్పుడు జగన్ చేస్తున్నది కూడా తప్పే. దీన్ని సంక్షేమం అనే చాన్సే లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే కొంతమంది ఇక మేము అప్పులు ఇవ్వలేము మొర్రో అని చేతులెత్తేస్తున్నారు…. అప్పుడు చివరికి టైటిల్ ను ‘ప్రచారానికి ప్రజాధనం’ గా మార్చాల్సి వస్తుందేమో…!