Jagan Vs Pawan Kalyan: పవన్ వైవాహిక జీవితం పై జగన్ సంచలన కామెంట్స్

పవన్ వారాహి యాత్రలో విధానపరమైన నిర్ణయాలు పైనే మాట్లాడారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. ఎక్కడా వ్యక్తిగత ఆరోపణల జోలికి వెళ్లలేదు.

Written By: Dharma, Updated On : October 12, 2023 4:16 pm

Jagan Vs Pawan Kalyan

Follow us on

Jagan Vs Pawan Kalyan: పవన్ వద్దు వద్దు అంటున్నా… ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత కామెంట్లకే ప్రాధాన్యమిస్తున్నారు. పవన్ పై అనుచిత వ్యాఖ్యలకు దిగుతున్నారు. వ్యూహమో? వ్యూహాత్మకమో? తెలియదు కానీ.. జగన్ మళ్ళీ పవన్ వైవాహిక జీవితం పై పడ్డారు. పవన్ తనపై రాజకీయ విమర్శలు చేస్తుంటే.. జగన్ మాత్రం వ్యక్తిగతంగానే పవన్ ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. తాజాగా సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సైతం పవన్ ను టార్గెట్ చేసుకుంటూ మాట్లాడారు జగన్.

పవన్ వారాహి యాత్రలో విధానపరమైన నిర్ణయాలు పైనే మాట్లాడారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. ఎక్కడా వ్యక్తిగత ఆరోపణల జోలికి వెళ్లలేదు.కానీ తన స్థాయికి మించి జగన్ విమర్శలు చేయడం విశేషం. పవన్ వైవాహిక జీవితంపై కొత్త పంధాలో జగన్ వ్యాఖ్యానించారు. వెటకారంతో కామెంట్స్ చేశారు. దత్తపుత్రుడికి శాశ్వత ఇల్లు ఏపీలో ఉండదు. హైదరాబాదులోనే ఉంటుంది కానీ.. ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడు నాలుగేళ్లకు మారిపోతూ ఉంటుందని ఎద్దేవా చేశారు. ఒకసారి లోకల్, ఇంకోసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్ అని తనదైన రీతిలో వెకిలి నవ్వుతో టీజింగ్ కు పాల్పడ్డారు.

అంతటితో ఆగకుండా ఆడవాళ్ళన్నా, పెళ్లిళ్ల వ్యవస్థ అన్నా పవన్ కు ఉన్న గౌరవం ఏంటో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. తాను చెబుతున్నవన్నీ నిజాలేనని తేల్చేశారు. మన ఇళ్లలోని మహిళలను, పెళ్లిళ్లను మనం గౌరవించకపోతే ఎలా అని ప్రశ్నించారు. మనమే నాయకులుగా ఉంటూ మూడు నాలుగేళ్లకు ఒకసారి ఇల్లాలను మారుస్తూ, మహిళలను చులకన భావంతో చూస్తే వారు ఎలాంటి పాలకులు, నాయకులవుతారో ప్రజలు విజ్ఞతతో ఆలోచించుకోవాలని సీఎం జగన్ సూచించారు.

అయితే సీఎం జగన్లో ఫ్రస్టేషన్ కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పవన్ వ్యవహరించిన తీరు కంటగింపుగా మారింది. చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీని దారుణంగా దెబ్బతీశానని జగన్ భావించారు. కానీ పవన్ నేరుగా జైల్లో ఉన్న చంద్రబాబును కలిసి తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించారు. అటు భారతీయ జనతా పార్టీలో సైతం ఒక కదలిక తీసుకు రాగలిగారు. బిజెపి పెద్దల్లో సైతం స్పష్టమైన మార్పు కనిపించింది. వీటన్నింటికీ కారణం పవనేనని జగన్ అనుమానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు అధికారం దూరం చేసేందుకు పవన్ ప్రయత్నిస్తుండడంతో జగన్ మండిపడుతున్నారు. అందులో భాగంగానే పవన్ వైవాహిక జీవితాన్ని హేళన చేస్తూ మాట్లాడారు. అయితే ఇందులో వ్యూహం ఉంటుందని అనుమానాలు ఉన్నాయి. దీనిపై పవన్ నుంచి ఏ స్థాయిలో రిప్లై వస్తుందో చూడాలి.