Pawan Kalyan- Visakha Incident: ఏపీ సీఎం జగన్ కు ఒక అలవాటు ఉంది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆయన లోకల్ మీడియాకు అంతగా ఇష్టపడరు. అసలు మాట్లాడే ప్రయత్నం చేయరు. ఎప్పుడూ నేషనల్ మీడియాతో మాట్లాడేందుకే ప్రయత్నిస్తారు. అలాగని ఇంగ్లీష్ గలగలా మాట్లాడలేరు. అంత ఫ్లూయంట్ గా రాదు కూడా. కానీ జాతీయ స్థాయి రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావించి మాట్లాడుతుంటారు. లోకల్ మీడియాకు వచ్చేసరికి ఎలాగూ తన సాక్షి పత్రిక ఉంది. ఎటువంటి అభిప్రాయాన్నైనా.. ఏ స్థాయి వార్తనైనా వేసుకునే వెసులబాటు ఉంది. అయితే అదే జగన్ ఇప్పుడు పవన్ కూడా నేషనల్ మీడియాలో కవరేజీ ఇప్పించారు. ప్రస్తుతం నేషనల్ మీడియాలో ప్రతీ చానల్ లో ఏపీ బులెటెన్ లో పవన్ కు చోటు దక్కుతోంది. ఈ పుణ్యం మాత్రం ముమ్మాటికీ జగన్ దే. విశాఖ ఎపిసోడ్ తరువాత జాతీయ స్థాయిలో జనసేన, పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్ గా మారుతున్నారు.

తనను టచ్ చేయవద్దని పవన్ హెచ్చరిస్తూనే వైసీపీని ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ఏపీలోఅధికార పార్టీని ఇరుకున పెట్టేలా పవన్ చేస్తున్న కామెంట్స్ అటు జాతీయ స్థాయిలో కూడా పెను దుమారాన్నే రేపాయి. జాతీయ మీడియాలో కవరేజీ లభించడంతో అటు బీజేపీ అగ్రనేతలు కూడా స్పందించారు. ఏపీకి వరుసగా క్యూకడుతున్నారు. ఏపీలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిస్థితులపై నేషనల్ మీడియా కథనాలు ప్రసారంచేస్తున్న నేపథ్యంలో అందులో ఏపీ విషయానికి వచ్చేసరికి పవన్ ప్రస్తావన వస్తోంది. రాష్ట్రంలో అధికార వైసీపీపై పవన్ చేస్తున్నకామెంట్స్, రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే బీజేపీని వదులుకుంటానన్న హెచ్చరికలు పతాక శీర్షికన నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇవి బీజేపీయేత పార్టీలను సైతం ఆకర్షిస్తున్నాయి.

సాధారణంగా నేషనల్ మీడియాలో ప్రాంతీయ పార్టీలకు అంతగా ప్రాధాన్యం ఉండదు. కానీ జనసేనకు మంచి ప్రాధాన్యతే దక్కుతుండడంపై జన సైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఎపిసోడ్ తమకు మంచి మైలేజీ ఇచ్చిందని భావిస్తున్నారు. వాస్తవానికి విశాఖ ఘటనలో జనసేన నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఎయిర్ పోర్టు ఘటనలో వైసీపీ మంత్రులు కవ్వింపు చర్యలకు పాల్పడడడం.. అందుకు జనసైనికులు దీటుగా స్పందించడం.. తరువాత పవన్ విశాఖ పర్యటనలపై ఆంక్షలు.. అటు తరువాత విజయవాడ వచ్చిన పవన్ వైసీపీ నేతలపై విరుచుకుపడడం.. అటు తరువాత చంద్రబాబు సంఘీభావం.. ఇలా వరుస ఘటనలకు నేషనల్ మీడియా ఎనలేని ప్రాధాన్యమిచ్చింది. అటు జాతీయ స్థాయి నాయకులు ఏపీలో ఏం జరుగుతోంది? అని తెలుసుకునేందుకు ఉత్సుకత చూపుతున్నారు. మొత్తానికైతే వైసీపీ జనసేనను కెలికి మరీ నేషనల్ మీడియాలో ప్రాధాన్యత దక్కేలా చేసిందనడం ఎటువంటి అతిశయోక్తి కాదు.