CM Jagan: బాధిత వర్గాల నుంచే శభాష్ అనిపించుకున్న చరిత్ర జగన్ కే చెల్లుబాటు అవుతోంది . ఎవరైతే బాధించబడ్డారో వారితోనే పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేయించుకున్నారు. ఎంతటి కాకలు తీరిన ఉద్యోగ సంఘాల నాయకులను అయినా కూడా తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. ఏపీ ఉద్యోగుల విషయంలోనే ఇది తేటతెల్లమైంది. ఉద్యోగుల జీతాలను తగ్గించారు. అలవెన్స్ లు కోసేసారు. పిఆర్సి ని పదేళ్లకు ఒకసారి ఇస్తామంటూ రూల్స్ మార్చేశారు. తీరా వారు రోడ్డుపైకి వచ్చేసరికి పిలిపించి చర్చలు జరిపారు. వారి ప్రయోజనాలు వారికి ఇచ్చేందుకు అంగీకరించారు. వారికి ఏదో మంచి చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు.
అయితే కోత విధించిన ప్రయోజనాలనే.. పునరుద్ధరించేసరికి ఉద్యోగ సంఘాల నాయకులకు పట్టలేని ఆనందం ఇచ్చింది. అందుకే వారి పాలాభిషేకాలు, పూలాభిషేకలతో సీఎం జగన్ను ముంచేత్తారు. మా గోచీలు మాకు ఇచ్చారు అంతే చాలు అంటూ వారు సంతృప్తితో సర్దుకున్నారు. అయితే ఇప్పుడు ఆ వంతు పోలీసులకు వచ్చింది. నాలుగేళ్ల పాలనలో ఉద్యోగుల వ్యతిరేకతను అణచివేసేందుకు ఉపయోగించిన పోలీసుల అలవెన్స్ లకు వరుసగా కోత విధిస్తున్నారు.
ప్రభుత్వం పోలీసులకు కల్పించిన వివిధ అలవెన్సుల్లో కోతపడుతోంది. ప్రభుత్వం జీవో 79 ని విడుదల చేసింది. ఈ జీవో కు తాము అనుకూలమేనని ప్రభుత్వానికి డిజిపి కార్యాలయం తెలిపినట్టు తెలుస్తోంది. దీంతో కోతలు ప్రారంభించింది. దిశ సిబ్బందికి 30 శాతం అలవెన్స్ లో కోత పెట్టింది. ఏజెన్సీ ఏరియాలో పనిచేసే యాంటీ నక్సలిజం స్క్వాడ్ సిబ్బందికి ఉన్న 15% అలవెన్స్ తొలగించింది. డిప్యూటేషన్ పై ఏసీబీలో పనిచేస్తున్న వారికిఐదు శాతం అలవెన్స్ ను కుదించింది. ఇక నేరుగా ఏసీబీలో రిక్రూట్ అయిన వారికి రెండు శాతం అలవెన్స్ తగ్గింది. చివరకు కానిస్టేబుల్కు సైకిల్ అలవెన్స్ కూడా ఎత్తేసింది.
సహజంగా ప్రభుత్వ చర్యలతో పోలీసు వర్గాల్లో ఓ రకమైన అసంతృప్తి ప్రారంభమైంది. ఇన్నాళ్లు ప్రభుత్వానికి సహకరిస్తే ఇదా ఫలితం అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ కోతలపై విపక్షాల సైతం స్పందిస్తున్నాయి. ప్రభుత్వం తీరును తప్పుపడుతున్నాయి. అయితే ఓ ఫైన్ మార్నింగ్ జగన్ సర్కార్ నుంచి పోలీస్ సంఘాలకు పిలుపు వస్తుంది. మీకు కోత విధించిన ప్రయోజనాలన్నింటినీ వెనక్కి ఇస్తున్నట్లు జగన్ ప్రకటిస్తారు. దీంతో పోలీస్ సంఘాలు జేజేలు పలుకుతాయి. అంటే ఒక్క రూపాయి ఖర్చు కాకుండా.. వైసీపీ సర్కార్కు, సీఎం జగన్ కు పోలీసు వర్గాలు జేజేలు పలుకుతాయన్నమాట. సో జగన్ తెలివితేటలు ముందు ఉద్యోగ సంఘాలు మాదిరిగా పోలీస్ సంఘాలు కూడా చిన్నబోతాయన్నమాట.