కరోనా వైరస్ విజృంభణతో ఏపీ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. వందల కోద్దీ మరణాలు.. వేల కొద్దీ కేసులు నమోదవుతున్నాయి. ఇది చాలదన్నట్లుగా కొత్తగా బ్లాక్ పంగ్ కేసులతో రాష్ట్రానికి ఊపిరాడడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. చాలా మంది వైరస్ తీవ్రతతో కాకుండా తమకు భరోసా లేదన్న బెంగతోనే చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు కరోనా బాధితుల దగ్గరికి వెళ్లి భరోసా కల్పిస్తున్నారు. వారికు అండగా ఉంటామని ధైర్యం చెబుతున్నారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం గడప దాటడం లేదన్న ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి.
గతేడాది కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు ఒకటి, రెండు కార్యక్రమాలకు తప్ప ఏపీ సీఎం జగన్ బయటి కార్యక్రమాల్లో కనిపించలేదు. ప్రతీదీ తాడేపల్లి కార్యాలయం నుంచి వర్చువల్ ద్వారా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కరోనాకు సంబంధించిన సమావేశాలు, ఆదేశాలు అక్కడి నుంచే ఇస్తున్నారు. అయితే ఈ సమయంలో ప్రజా అవసరాలు తీర్చినా… వారికి మేమున్నామనే ధైర్యం చెబితే కొంత ఉపశమనం కలుగుతుందని అంటున్నారు.
ఇటీవల కొందరు ముఖ్యమంత్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆసుపత్రులు, కరోనా బాధిుతులు ఉండే ఇళ్లకు వెళుతున్నారు. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ ఆసుపత్రిని సందర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రోజుకో కాలనీ తిరుగుతూ బాధితులకు అండగా ఉంటామని ధైర్యం చెబుతున్నారు. దీంతో వారికి వైరస్ సోకిందన్న బాధ కంటే తమకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా కలుగుతుందని అంటున్నారు.
అయితే సీఎం జగన్ మాత్రం సంవత్సరకాలంగా కార్యాలయం గడప దాటడం లేదంటున్నారు. సుధీర్ఘ కాలంగా వర్క్ ఫ్రం హోం నే చేస్తున్నారు. కీలక నిర్ణయాలన్నీ అక్కడి నుంచే చేస్తున్నారు. అయితే ప్రత్యక్షంగా ఏం జరుగుతుందో ప్రజల్లోకి తెలుసుకుంటే బాగుండునని కొందరు అంటున్నారు. ఇటీవల తిరుపతి ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. అయితే అంత ఘోరం జరిగినప్పుడు కనీసం ఆసుపత్రిని సందర్శించకపోవడం విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.